Cases on TDP Leaders :తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై 22, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌పై 23, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై 24, జగన్ జమానాలో అయిదేళ్లలో ప్రధాన ప్రతిపక్ష నాయకులపై పెట్టిన కేసుల సంఖ్య ఇది. అధికారం చేపట్టిన మరుసటి రోజు నుంచే పోలీసు వ్యవస్థను, యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకున్న జగన్ ప్రతిపక్ష నేతలపై ఎడాపెడా కేసులు పెట్టించారు. అడుగు తీసి అడుగేస్తే కేసు, నిరసన తెలిపినా కేసు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపునిస్తే ముందస్తు నిర్బంధం కింద ఇంకో కేసు, సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడితే కేసు, వైఎస్సార్సీపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వ అరాచకాల బారినపడ్డ బాధితుల తరఫున గళమెత్తితే మరో కేసు, ఇలా ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో బనాయించారు.
అసలు సంఘటన స్థలంలోనే లేని విపక్ష నాయకులపై, అధికార పార్టీ నాయకుల చేతిలో దాడికి గురైన ప్రతిపక్ష నాయకులపైనా హత్యాయత్నం సెక్షన్లు బనాయించారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేశారు. విపక్ష నాయకులను వేధించేందుకు సీఐడీ, ఏసీబీలనూ వాడేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లను పరిశీలిస్తే అధికార పార్టీ బెదిరింపు ధోరణి స్పష్టమవుతోంది. 2019కు ముందు వీరిలో కొంతమందిపై అసలు కేసులే లేకపోగా కొందరిపై 1,2 ఉన్నాయి. 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు వారిపై పదుల కొద్దీ కేసులు నమోదయ్యాయి. అయిదేళ్లుగా విపక్షాలను అణచివేసేందుకు జగన్ ప్రయత్నాలకు ఈ కేసుల సంఖ్యే నిదర్శనం.
చంద్రబాబు నాయుడు : టీడీపీ అధినేత చంద్రబాబుపై అయిదేళ్లలో ఏకంగా 22 కేసులు పెట్టారు. వీటిల్లో సీఐడీ పెట్టినవే ఎనిమిది ఉన్నాయి. అంగళ్లులో చంద్రబాబుపై దాడి చేయటమే కాక తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అనంతపురం, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో ఆయనపై కేసులున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై చంద్రబాబు సూచనలతో టీడీపీ శ్రేణులు రాళ్లు, చెప్పులు విసిరి, అద్దాలు పగులగొట్టి హత్యకు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆసుపత్రికి వెళుతున్న చిన్నారి మృతి చెందారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని కేసు నమోదైంది. కొవిడ్ రెండో దశలో 440కే వేరియంట్ గురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని చంద్రబాబుపై కేసు నమోదైంది. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చంద్రబాబు చెప్పినందుకు విజయవాడ సూర్యారావుపేట ఠాణాలో కేసు నమోదు చేశారు.
ఉచిత ఇసుక పాలసీపై చంద్రబాబు హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు గండిపడిందని, ప్రివిలేజ్ ఫీజు, డిస్టలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంలో లోపాలున్నాయని సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్ రింగురోడ్డు మాస్టర్‌ప్లాన్ నిర్ణయాల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. వాటితోపాటు నైపుణ్యాభివృద్ధి, ఏపీ ఫైబర్‌నెట్, ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగంవంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసింది.
నారా లోకేశ్ : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై 2019కంటే ముందు ఒక్క కేసూ లేదు. అయిదేళ్ల వైసీపీ పాలనలో ఆయనపై ఏకంగా 23 కేసులున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం యువగళం పాదయాత్ర సమయంలో అనుమతులు లేకపోయినా సమావేశాలు నిర్వహించారనే అభియోగాలవే. అనుమతి లేకుండా సౌండ్ సిస్టమ్ వాడారంటూ కేసులు పెట్టారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆసుపత్రికి వెళుతున్న చిన్నారి మృతి చెందారని సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారంటూ లోకేశ్‌పైనా కేసు నమోదైంది.
ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ వేర్వేరు కేసులు పెట్టారు. కనకదుర్గమ్మ వారధిపై ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించారని కేసు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ట్రాక్టరు నడిపారని మరో కేసు ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల విధులను అడ్డుకుంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారని కేసు పెట్టారు. అమరావతి ఇన్నర్‌రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌కు సంబంధించి సీఐడీ కేసు ఉంది.
అచ్చెన్నాయుడు :టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై మొత్తం 24 కేసులుండగా వాటిల్లో 21 వైసీపీ హయాంలో నమోదైనవే. 11 కేసులు నేరానికి పాల్పడే అవకాశముందంటూ సీఆర్‌పీసీ 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్టులకు సంబంధించినవే. అల్లర్లకు పాల్పడేలా, పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రజలను రెచ్చగొట్టారంటూ ఆయనపై కుప్పం స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపైకి రాళ్లు, తాగునీటి సీసాలు విసిరి కారు అద్దం పగులగొట్టారని ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని, కొవిడ్ 440కే వేరియెంట్ వైరస్ వ్యాపిస్తోందంటూ భయాందోళనలు సృష్టించారని, పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలపై వివిధ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా నైపుణ్యాభివృద్ధికి సంబంధించి సీఐడీ కేసు, ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో ఏసీబీ కేసు ఉంది. మత ఘర్షణలు రెచ్చగొట్టారని మరో కేసు పెట్టారు.
Police Registered Cases Against Lokesh: లోకేశ్‌తో పాటు టీడీపీ నేతలపై కేసులు... ఎందుకంటే..!
చింతమనేని ప్రభాకర్ : తెలుగుదేశానికి చెందిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ హయాంలో ఏకంగా 47 కేసులున్నాయి. వీటిల్లో 14 ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులే. జగన్ అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే చింతమనేనిపై 13 కేసులు పెట్టారు. 2020, 2021లో ఎనిమిది చొప్పున 16 కేసులు, 2022లో ఏడు, 2023లో ఎనిమిది, 2024లో 3 కేసులు నమోదయ్యాయి. దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు మూడో పట్టణం, చింతలపూడి, ధర్మాజీగూడెం పోలీసుస్టేషన్లలో ఈ కేసులున్నాయి.
బెదిరింపులకు పాల్పడ్డారని, అక్రమంగా నిర్బంధించారని, ఆయుధాలతో దాడులు చేశారని కేసులు పెట్టారు. నేరానికి పాల్పడే అవకాశముందని సీఆర్‌పీసీ 151 సెక్షన్ కింద ముందస్తు అరెస్టులకు సంబంధించిన 6 కేసులు చింతమనేనిపై ఉన్నాయి. సీఐడీ కేసు ఉంది. గతేడాది భీమవరంలో లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ మద్దతుదారులు సీసాలు, రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో పోలీసులు, తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. నిందితులను వదిలేసి వైసీపీ వారి ఫిర్యాదు మేరకు అసలు సంఘటన స్థలంలోనే లేని చింతమనేని సహా మరికొందరిపై హత్యాయత్నం కేసు పెట్టారు.