Cantonment MLA Lasya Nanditha Passed Away : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడింది. పది రోజుల క్రితం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తృటిలో మృత్యువు నుంచి బయటపడిన ఆమె, నేడు పటాన్చెరు ఓఆర్ఆర్పై జరిగిన యాక్సిడెంట్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. కారు వేగంగా వెళ్లి రెయిలింగ్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే నందిత ఘటనా స్థలిలోనే మరణించినట్లు నిర్ధారించారు. సరిగ్గా ఏడాది క్రితం ఆమె తండ్రి, దివంగత ఎమ్మెల్యే సాయన్న అనారోగ్య సమస్యలతో మృతి చెందగా, ఇప్పుడు లాస్య నందిత ఇలా రోడ్డుప్రమాదంలో మరణించారు. ఆమె మరణ వార్త విని లాస్య తల్లి, సోదరి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కార్కానాలోని ఆమె నివాసంలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజానీకం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటున్నారు.
బీఆర్ఎస్ నేతల సంతాపం : ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత, రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
- గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన సాయన్న మృతి నుంచి ఇంకా కోలుకోకముందే, ప్రజాసేవలో ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన యువ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. లాస్య మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. - మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- లాస్య నందిత మృతి చాలా బాధాకరం. రోడ్డు ప్రమాదంలో నందిత మృతి వార్త తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యా. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య, మూడు నెలల్లోనే ఇలా అందరికీ దూరం అయిపోతుంది అనుకోలేదు. - తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి