ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సబ్సిడీల్లో 88 శాతం విద్యుత్ రాయితీలే - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG REPORTS ON CFMS

శాసనసభకు తొలిసారి సీఎఫ్ఎంఎస్ నివేదిక ఇచ్చిన కాగ్‌ - సీఎఫ్ఎస్ఎస్ సంస్థ కాగ్‌కు ఎలాంటి పత్రాలూ సమర్పించలేదని వెల్లడి

cag_reports_on_cfms
cag_reports_on_cfms (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 4:52 PM IST

CAG Reports on CFMS to AP Assembly:2023తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి ఆర్ధిక అంశాలు, బడ్జెట్ నిర్వహణ, పద్దులపై కాగ్ (Comptroller and Auditor General of India) నివేదిక తెలిపింది. 2022-23 ఆర్దిక సంవత్సరంలో రెవెన్యూ రాబడులు గణనీయంగా తగ్గాయన్న కాగ్ స్పష్టం చేసింది. ఇదే సంవత్సరానికి రెవన్యూ వ్యయం 26.45 శాతం మేర పెరిగిందని పేర్కొంది. రెవెన్యూ లోటు 2022తో పోలిస్తే రూ.8611 నుంచి రూ.43,487 కోట్లతో 405.02 శాతం పెరిగిందని కాగ్ వెల్లడించింది. తప్పనిసరి వ్యయం రూ.15,451 కోట్లు, స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు రూ.14,208 కోట్లు, రూ 8315 కోట్ల సబ్సీడీలు పెరగటం రెవెన్యూ లోటు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అని కాగ్ తెలిపింది.

2021-22తో పోలిస్తే ద్రవ్యలోటు రూ.25,013 నుంచి 109 శాతం పెరిగి రూ.52,508 కోట్లుకు చేరిందని కాగ్ వెల్లడించింది. రాబడి-వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు కాగ్ గుర్తించింది. రాబడికి మించి చేసిన ఖర్చుల కా రణంగా రెవెన్యూ లోటు బారీగా పెరిగిందని తెలిపింది. 2022-23 ఏడాదికి మూలధన వ్యయం కింద రూ.7244 కోట్లు మాత్రమే వ్యయం చేశారని వివరించింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సబ్సిడీల మొత్తం రూ.23,004 కోట్లని కాగ్ పేర్కొంది.

సబ్సిడీల్లో 88 శాతం మేర విద్యుత్ రాయితీలే ఉన్నాయని కాగ్ పేర్కొంది.. 2023 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 1.28 లక్షల కోట్ల బడ్జెట్​లో చూపని రుణాలు తీసుకున్నట్టు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ఫండ్​కు ఇది జమ కాకపోయినా బడ్జెట్ ద్వారానే తిరిగి చెల్లించేలా నిర్ణయాలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది. వివిధ కార్పోరేషన్ల నుంచి రూ. 20,872 కోట్ల రుణాల కోసం ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చిందని కాగ్ తెలిపింది. హామీలపై ప్రభుత్వానికి కమిషన్​గా రూ.2015 కోట్లు రావాల్సి ఉన్నా అదేమీ వసూలు కాలేదని తెలిపింది.

జీఎస్ డీపీలో ప్రభుత్వ రుణం 27.05 శాతానికి పెరిగిందని నివేదికలో కాగ్ పేర్కొంది.. సమీప భవిష్యత్​లో ఇది రుణస్థిరీకరణ సాధ్యం కాదని సూచిస్తున్నట్టు కాగ్ వెల్లడించింది. బడ్జెటేతర రుణాలతో కలిపి ప్రభుత్వం అప్పు జీఎస్డీపీలో 41.89 శాతంగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ఇది తీవ్ర భారాన్నిసూచిస్తోందని వెల్లడించింది. 16వ శాసనసభ రెండవ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.

అదిరిన సీన్​ - పవన్​ను ఆలింగనం చేసుకున్న బొత్స - ముఖం చాటేసిన పెద్దిరెడ్డి

సీఎఫ్ఎంఎస్​పై కాగ్ నివేదిక:తొలిసారి శాసనసభలో కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టం (సీఎఫ్ఎంఎస్)పై కాగ్ నివేదికను ఇచ్చింది. 2018 నుంచి సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆర్ధిక లావాదేవీలు జరుగుతున్నట్టు స్పష్టం చేసింది. 2019- 2021 మధ్య కాలానికి గానూ సీఎఫ్ఎంఎస్ నిర్వహణపై కాగ్ నివేదిక రూపొందించింది. సీఎఫ్ఎంఎస్ భద్రతా వ్యవస్థ, సమాచార గోప్యతపై రాష్ట్ర ఆర్ధిక శాఖ, సీఎఫ్ఎంఎస్​ను నిర్వహించే ఏపీ సీఎఫ్ఎస్ఎస్ సంస్థ కాగ్​కు ఎలాంటి పత్రాలు సమర్పించలేదని వెల్లడించింది.

సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ భద్రతపై ఆడిట్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కాగ్ నివేదికలో వెల్లడించింది. సీఎఫ్ఎంఎస్ ద్వారా చేసే బిల్లుల చెల్లింపుల్లో నకిలీలను పరిశీలించే ఏర్పాటు లేకపోవటం వల్ల అధిక చెల్లింపులు జరిగాయని కాగ్ తెలిపింది. 2018 నుంచి 2021 వరకూ 1,41,917 బిల్లులకు సంబంధించి 968 కోట్ల రూపాయల అధిక చెల్లింపులు జరిగాయని పేర్కొంది. ఇది బలహీనమైన ప్రాసెసింగ్ నియంత్రణను బయటపెట్టిందని స్పష్టం చేసింది. అధికంగా చేసిన చెల్లింపులను తిరిగి వసూలు చేయాల్సిందిగా సిఫార్సు చేసినట్టు కాగ్ తెలిపింది.

2018 ఏప్రిల్ నుంచి 2021 సెప్టెంబరు మధ్య 193 ఖజానా అధికారుల పరిధిలో 218 కోట్ల రూపాయలు అధికంగా పెన్షన్ సొమ్ము డ్రా చేసినట్టు కాగ్ వెల్లడించింది. దీనికి కారణమైన అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది. ఆర్ధిక శాఖలోని రుణ నిర్వహణా విభాగం ప్రమేయం లేకుండానే 1.44 లక్షల పీడీ ఖాతాలను సృష్టించినట్టు వెల్లడించింది. 2019 మార్చి నుంచి 2021 మార్చి వరకూ పీడీ ఖాతాల్లోని 71,568 కోట్లు మురిగిపోయాయని తేల్చింది.

బిల్లులు ఆమోదించి, రద్దు చేసే విధానాలు సహేతుకంగా లేవని కాగ్ తెలిపింది. నిధులు ఉన్నా పేమెంట్ గేట్​వే వద్ద బిల్లులు నిలిపివేయటం పారదర్శకత లోపాన్ని సూచిస్తోందని పేర్కొంది. ఆర్ధిక నిబంధనల ఉల్లంఘన కారణంగా సీఎఫ్ఎంఎస్ ప్రధాన లక్ష్యమైన పారదర్శకతను ఇది నీరుగార్చిందని వెల్లడించింది. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థలో లోపభూయిష్ట ప్రక్రియల కారణంగా ఇది ప్రభుత్వ ఆర్ధిక క్రమశిక్షణలో అనుకున్న ఫలితాలను అందించటంలో విఫలమైందని పేర్కొంది.

ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు - నేను ఇంత వరకూ ఆయన్ను చూడలేదు : షర్మిల

తప్పు చేసి 'సారీ' అంటే ఊరుకుంటామా? - ఏ ఒక్కరినీ వదిలేదిలేదు : లోకేశ్

ABOUT THE AUTHOR

...view details