Bus Shelters Shortage in GHMC : గ్రేటర్ హైదరాబాద్‌లో అవసరమైనన్ని బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్ షెల్టర్ల ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారిపోయింది. గ్రేటర్ పరిధిలో మొత్తం 2 వేల 814 బస్సుల్లో నిత్యం 19 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఆ సంఖ్య మరింత పెరిగింది. హైదరాబాద్ మహా నగరంలో 1370 బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయగా, మరికొన్ని ప్రాంతాలను ఆర్టీసీ అధికారులు గాలికి వదిలేశారు.
Public Facing Problems for no Bus Shelters : దీంతో ప్రయాణికులు మండుటెండలోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు కోసం ఎదురు చూడడానికి అవసరమైన చోట బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. ప్రయాణికులు ఎక్కడ బస్ ఎక్కుతారో సర్వే చేయకుండానే బస్ షెల్టర్లు నిర్మించడంతో చాలా షెల్టర్లు నిరుపయోగంగా మారిపోయాయి. షెల్టర్లు లేని స్టాపుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు ఎండవేడిమి తాళలేక రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను ఆశ్రయిస్తున్నారు.
ఇదే సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్ల నిర్వహణను అధికారులు విస్మరించడంతో ఏసీలు సరిగ్గా పనిచేయడం లేదు. దీంతో ఎండాకాలంలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. హిమాయత్ నగర్ రోడ్డు, నారాయణగూడ, కాచిగూడ, అమీర్ పేట్, కోఠీ, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో బస్సు ఎక్కాలంటే కొంతదూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది.