New online System Build Now : భవనాలు, లే అవుట్ల అనుమతుల కోసం నూతన ఆన్లైన్ వ్యవస్థ 'బిల్డ్ నౌ' సిద్ధం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. వివిధ వర్గాలకు శిక్షణ ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి బిల్డ్ నౌ సాఫ్ట్‌వేర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. కొత్త విధానంలో డ్రాయింగ్ పరిశీలన, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ మరింత వేగం కానుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భవనం, లే అవుట్ ప్లాన్‌ను ఆగ్మెంటెడ్ రియాల్టీతో త్రీడీ విధానంతో చూసే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.
రాష్ట్రంలో భవనాలు, లేఅవుట్ల ఆమోదం కోసం నూతన ఏకీకృత ఆన్ లైన్ వ్యవస్థ రూపొందించినట్లు మంత్రి దుద్దిళ్ల తెలిపారు. లేఅవుట్లు, హైరైజ్ భవనాల డ్రాయింగ్ స్క్రుటినీలో జాప్యం తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత అప్లికేషన్ లో దరఖాస్తు సమర్పణ, స్టేటస్ ట్రాకింగ్, ఫీజు చెల్లింపు కోసం అనేక ప్లాట్ ఫారమ్‌లను నేవిగేట్ చేయాల్సి వస్తోందని.. దానివల్ల గందరగోళం, జాప్యం జరుగుతోందని శ్రీధర్ బాబు చెప్పారు.
వీటన్నింటికి పరిష్కారం చూపుతూ భవన నిర్మాణాలు, లేఅవుట్ అనమతులు, ఆక్యుపెన్సీ, టీడీఆర్ సర్టిఫికెట్లతో పాటు అనధికార నిర్మాణాలకు నోటీసులు జారీ వంటి సేవలు ఒకే చోట ఉండేలా నూతన అప్లికేషన్ సిద్ధం చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొత్త విధానంలో దేశంలోనే అత్యంత వేగంగా.. డ్రాయింగ్, హై రైజ్ భవనాల స్క్రూటినీ కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుందని చెప్పారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించిన జీవోలు, సందేహాలు నివృత్తి చేసేందుకు ఏఐ ఆధారిత చాట్ సదుపాయం కూడా ఉంటుందన్నారు.
అగ్మెంటెడ్ రియాలిటీ తో కూడిన 3D విజువలైజేషన్ సౌకర్యం కూడా కొత్త అప్లికేషన్ లో ఉంటుందని తెలిపారు. భవన నిర్మాణ నమూనాలను 3Dలో పరిశీలించవచ్చు ప్రణాళికను తనిఖీ చేసి ప్రతి వివరాలను దృశ్యరూపకంగా ధృవీకరించుకోవచ్చునని మంత్రి చెప్పారు. అప్లికేషన్లన్ లో పత్రాలన్నీ బ్లాక్‌చెయిన్ వో భద్రంగా ఉంటాయని తెలిపారు. నాన్ హై రైజ్ భవన నిర్మాణ ప్లాన్ ఆమోదించే సమయం 21 రోజుల నుండి 15 రోజులకు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ సమయం 15 రోజుల నుండి 10 రోజులకు తగ్గుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
అధికారులు సైట్ నుండి నేరుగా ఫోటోలు, సెట్‌బ్యాక్, రోడ్డు వెడల్పు వంటి రియల్-టైమ్ డేటాను అప్‌లోడ్ చేయడానికి వీలుంటుందన్నారు. ఏఐ డేటా కో-పైలట్ రియల్ టైమ్ లో సిస్టమ్ పనితీరుపై వివరణాత్మక నివేదికలను అందిస్తుందన్నారు. కొత్త విధానంపై వివిధ వర్గాలకు శిక్షణ ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ పరిధిలో ఏడాదిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వివరించారు.