Budameru Flood Effect on Public Schools in Vijayawada :బుడమేరు వరద ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. విజయవాడలో చాలా బడుల్లోకి వరద చేరి తరగతి గదుల్లో బురద, ఇసుక, మట్టి పేరుకుపోయాయి. విలువైన సామగ్రి నీటిలో కొట్టుకుపోయాయి. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 100 ప్రభుత్వ పాఠశాలలు ముంపు బారిన పడ్డాయని ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నష్ట నివేదికలు పంపుతున్నారు.
చాలా బడుల్లోకి వరద :ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు విజయవాడ జలమయమైంది. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో జనావాసాలతో పాటు పాఠశాలలు పూర్తిగా నీటమునిగాయి. బడుల్లోకి బురద, ఇసుక, చెత్తాచెదారం చేరడంతో సుమారు 16 రోజులు పాటు సెలవులు ప్రకటించారు. వరద తగ్గిన తర్వాత పాఠశాలలకు చేరుకున్న సిబ్బంది తరగతి గదుల్లోని బురద, వ్యర్థాలను శుభ్రం చేసుకున్నారు. కొన్ని పాఠశాలలకు వెళ్లే దారి ఇరుకుగా ఉండటంతో ఫైరింజన్లు వెళ్లలేకపోయాయి.
ఆదుకోండి మహాప్రభు - సాయం కోసం రైతుల ఎదురుచూపులు - Crops Damaged By Heavy Rains
పాఠశాలల్లో పేరుకుపోయిన బురద, ఇసుక, మట్టి :పాఠశాల సిబ్బంది సహాయంతో ఉపాధ్యాయులే బడులను శుభ్రం చేసుకున్నారు. మరి కొన్ని చోట్ల కూలీలతో శుభ్రం చేయించారు. దాదాపు 10 రోజులకు పైగా పాఠశాలలు వరదల్లో ఉండడంతో రికార్డులు, పుస్తకాలు, యూనిఫాంలతో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా పాడైపోయాయి. విద్యార్థులు పుస్తకాలను పాఠశాలలో పెట్టి కావాల్సిన వాటిని ఇంటికి తీసుకెళ్తుంటారు. అనుకోని విపత్తు వల్ల దాదాపు పుస్తకాలన్నీ తడిసి ముద్దయ్యాయి. చాలా పాఠశాలల్లో విద్యార్థులు చదువుకునేందుకు పుస్తకాలు లేవు. దీన్ని గమనించిన పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నులు అందిస్తున్నారు.