Harish Rao Responded to Stray Dog Attacks : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుపోతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఎందరో పసికందుల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
శుక్రవారం ఒక్కరోజే.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి ఘటనలు జరిగాయని హరీశ్ రావు తెలిపారు. అంతకముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయవిధారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
వీధికుక్కల స్వైరవిహారం - బాలుడి పురుషాంగంపై దాడి
8 నెలల కాలంలో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయి :బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని, చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గమని మాజీ మంత్రి దుయ్యబట్టారు. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గత ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదని అన్నారు.