BRS MLC Kavitha Released from Tihar Jail in Delhi : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదలయ్యారు. ఉదయం బెయిల్ మంజూరు కాగా, ఆమె తిహాడ్ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు సాదరంగా కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. పిడికిలి బిగించి "జై తెలంగాణ" అంటూ కవిత నినాదం చేశారు. కవితను హత్తుకొని కేటీఆర్, కవిత భర్త, కుమారుడు భావోద్వేగానికి గురయ్యారు. తిహాడ్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. వారిని చూసి ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు.
"పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయం. మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. కష్ట సమయంలో మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు. నేను కేసీఆర్ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండి దాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. రాజకీయ కక్షలో భాగంగానే నన్ను జైలుకు పంపారు. న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతాం. మేము పోరాడుతాం నిర్దోషిగా నిరూపించుకుంటా. ప్రజా క్షేత్రంలో మరింత నిబద్ధతతో పనిచేస్తాం" అని ఎమ్మెల్యే కవిత చెప్పారు.
అసలేం జరిగింది : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారించిన జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం, ఈడీ, సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది.
మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో బెయిల్‌తో పాటు కొన్ని షరతులు విధించిన ధర్మాసనం, ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించింది. పాస్‌పోర్టును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది.