BRS MLA Harish Rao Fires On CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికి కూడా పాల్పడ్డారని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్ రావు అన్నారు. రుణమాఫీ హామీపై మాట తప్పారని, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేనన్న విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఇంతగా దిగజారిన దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఇంకెవరూ లేరన్న ఆయన అబద్దం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉందని వ్యాఖ్యానించారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై అవాకులు చెవాకులు పేలారని హరీశ్ రావు మండిపడ్డారు.
రుణమాఫీ హామీపై మాట తప్పారు: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ. 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానన్న రేవంత్ రెడ్డి అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు రూ.31వేల కోట్లు మాఫీ చేస్తానని రూ. 9వేల కోట్లు కోతపెట్టారని విమర్శించారు.
BRS MLA Harish Rao Comments : సోనియా మీద ఒట్టు పెట్టినా, దేవుళ్ల మీద ఒట్టు పెట్టినా అబద్దమే లక్షణం మోసమే విధానం మాట తప్పడమే నైజం అనే విధంగా తన నిజస్వరూపాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ బట్టబయలు చేసుకున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాము మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు రూ.17వేల కోట్లు అయ్యిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? రూ. 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ ఒక్క విషయంతోనే కాంగ్రెస్ చేసిన రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోతోందని వ్యాఖ్యానించారు. దగా చేశారన్నది స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాజీనామా ఎవరు చేయాలి? ఏటిలో దూకి ఎవరు చావాలని అడిగారు.