Harish Rao Fires On CM Revanth : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక పల్లాపై అక్రమకేసులు పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హస్తం పార్టీపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. హైడ్రాపెరిట హైడ్రామా నడుపుతున్నారన్న హరీశ్‌రావు కాంగ్రెస్‌లో చేరని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. ఆయన్ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ సర్కారు చూస్తోందని విమర్శించారు. అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డే కూలగొడతారన్నారు.
రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ : రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతుండటంపై హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ కేసులు 36శాతం పెరిగాయన్న ఆయన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవన్న హరీశ్‌రావు ప్రజల ఆరోగ్యం కంటే ఏదైనా ముఖ్యమైనది ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని, తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అయినా డెంగీపై సమీక్ష చేయకుండా విపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా :'పేరుకు ప్రజాపాలన. జరుగుతుంది మాత్రం సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం. అధికార కాంగ్రెస్‌కు ప్రజా సమస్యలు పరిష్కారం కంటే సంచలనాలపైనే దృష్టి. ప్రజలు విషజ్వరాలతో అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం మాత్రం ప్రత్యర్థులపై విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు పిట్టల్లా రాలుతుంటే చీమ కుట్టినట్లైన లేదు. ఉద్యమ నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేస్తున్నారు. చీమకు కూడా హాని తలపెట్టని పల్లా కుటుంబాన్ని కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఎఫ్ టీ ఎల్ లో ఉంటే 24 గంటల్లో ఆయనే కూల్చివేస్తారు' అని హరీశ్‌రావు అన్నారు.