Brother Donates Land To Village in Karimnagar :కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలిరామయ్యపల్లి అనుబంధ గ్రామం నునుగొండపల్లికి చెందిన రామవ్వ, లస్మయ్యలకు ముగ్గురు కుమారులు. సత్యనారాయణ, మల్లయ్య, ప్రభాకర్. మూడో కుమారుడు ప్రభాకర్ డిగ్రీ చదువుతున్న సమయంలో 2004లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ప్రభాకర్‌కు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఉమ్మడి ఆస్తిలో ఆయన వాటా కింద వచ్చే స్థలాన్ని గ్రామాభివృద్ధికి ఇవ్వాలని మిగిలిన ఇద్దరు సోదరులు నిర్ణయించుకున్నారు.
రూ.కోటి విలువైన భూమి గ్రామానికి :సత్యనారాయణ, మల్లయ్యలకు ఇటీవల తమకు వారసత్వంగా వచ్చిన భూమి పంపకాలు జరిగాయి. ఈ క్రమంలో మొత్తం 3.18 ఎకరాల్లో మూడో కుమారుడు ప్రభాకర్ వాటా కింద 1.06 ఎకరాల వాటా వచ్చింది. ప్రస్తుతం ఆ స్థలం బహిరంగ మార్కెట్లో సుమారు రూ.కోటి పలుకుతున్నా, ఆ భూమిని గ్రామాభివృద్ధికి విరాళంగా ఇచ్చారు. గురువారం గ్రామస్థుల సమక్షంలో భూ దాన పత్రాన్ని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఉప్పుల అంజనీ ప్రసాద్‌కు అందజేశారు.
'నా సంపదలో సగానికి పైగా సమాజానికే తిరిగి ఇచ్చేస్తా' - OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మెన్ - Sam Altman Pledges To Donate Wealth
విరాళంగా ఇచ్చిన భూమిలో విగ్రహం ఏర్పాటు :ఈ సందర్భంగా ప్రభాకర్ తల్లిదండ్రులను ఆయన సన్మానించారు. ప్రభాకర్ అన్నలైన సత్య నారాయణ, మల్లయ్య ఇద్దరూ వ్యవసాయదారులు, నిరక్షరాస్యులు. ఊరి ప్రగతికి విలువైన భూమిని అందజేసిన ఆ సోదరులిద్దర్నీ గ్రామస్థులు అభినందిస్తున్నారు. కాగా, దానం చేసిన స్థలంలో ప్రభాకర్ విగ్రహాన్ని అంజనీప్రసాద్ రూ.40 వేలు వెచ్చించి ఏర్పాటు చేయించారు.
ఇటీవల కాలంలో భూ తగాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ మధ్య కాలంలో భూమి కోసం తమ్ముడిని కొట్టి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మరో కేసులో ఆన్లైన్ బెట్టింగ్ చేసి రూ.5 కోట్లు పోగొట్టుకుని, ఏం చేయాలో తెలీక సొంత బావమరిదినే చంపాడు ఓ వ్యక్తి. ఇలా రోజుకో వార్త ఆస్తి, భూమి కోసం హత్యలు ఇలాంటివే చూస్తున్నాం. సొంత వారు అని చూడకుండా ఆస్తికోసం పాకులాడే వారి ఉదంతాలు రోజుకు కనీసం ఒకటైనా ఉంటున్నాయి. కానీ వీరిద్దరు అన్నదమ్ములు తమ సోదరుడు ఉన్నాలేకున్నా తన వాటాను ఆశించకుండా గ్రామాభివృద్ధికి ఇచ్చారంటే స్ఫూర్తే కదా.
తండ్రికి లివర్ డొనేట్ చేసేందుకు కూతురు రెడీ- కానీ కోర్టు పర్మిషన్ కోసమే వెయిటింగ్!
వరద బాధితులకు అండగా హైదరాబాద్ రేస్ క్లబ్ - రూ.2 కోట్ల విరాళం