Brother Anil key comments: గత ఎన్నికల్లో క్రిస్టియన్, మైనారిటీ ఓట్లతో లబ్ధి పొంది.. అధికార పీఠమెక్కిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ఈసారి అదే ఓటర్లు గుణపాఠం చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ప్రముఖ క్రైస్తవ ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ రాష్ట్రమంతా తిరిగి క్రిస్టియన్ల ఓట్లన్నీ వైసీపీకి వచ్చే విధంగా తన వంతు కృషి చేశారు. ఇపుడు ఆయనే వైసీపీకి వ్యతిరేకంగా క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కడప పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలో ఉన్న నేపథ్యంలో, ఆమె గెలుపుకోసం బ్రదర్ అనిల్ కుమార్ కడపజిల్లాలో ఫాస్టర్లు, క్రైస్తవులతో సమావేశం అవుతున్నారు. ఆదివారం కడపలో పలు చర్చిల్లో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్న అనిల్ కుమార్ పాపులను తొక్కి పడేయాలని, ధైర్యంగా ఉంటే ఏసుక్రీస్తు అండగా ఉంటారని పిలుపునిచ్చారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల పోటీ చేసి వైసీపీ ఓట్లను చీలుస్తారని ఈనెల 25న జగన్ మోహన్ రెడ్డి పులివెందుల సభలో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఆయన అనుమానం నిజం చేసే విధంగా బ్రదర్ అనిల్ కుమార్ క్రిస్టియన్, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించిన అనిల్ ఇపుడు భార్య షర్మిల గెలుపు కోసం కడపజిల్లాలో మకాం వేసి క్రిస్టియన్ల ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. దేశ విదేశాల్లో క్రైస్తవ ప్రభోధకుడుగా మంచి పేరున్న బ్రదర్ అనిల్ కుమార్ మాటకు చాలా విలువ ఇస్తున్న సందర్భంలో ఆయన మాటను క్రైస్తవులు జవదాటరనే ప్రచారం ఉంది. అందులో భాగంగా రెండు రోజుల నుంచి ఆయన కడప పార్లమెంటు పరిధిలో పర్యటిస్తున్నారు. శనివారం ప్రొద్దుటూరులో ఫాస్టర్లతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. అంతర్గతంగా వారితో సమావేశమై... షర్మిల గెలుపుకోసం కృషి చేయాలని కోరినట్లు తెలిసింది.