Police Special Treatment to Borugadda Anil Kumar :పోలీసు కస్టడీలో ఉన్న వైఎస్సార్సీపీ నేత, రిమాండ్ ఖైదీ బోరుగడ్డ అనిల్ కుమార్ తన చెల్లెలి కుమారుడితో పోలీస్ స్టేషన్లో సిబ్బంది సమక్షంలోనే ముచ్చటించిన మరో వీడియో బయటకు వచ్చింది. కస్టడీలో ఉన్న నిందితుడిని బయటి వ్యక్తి వచ్చి కలవడం పోలీసుల నిర్లక్ష్యమా, లేక అతనికి దాసోహమా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అక్టోబర్ 26 నుంచి 29 వరకు అనిల్‌కుమార్ గుంటూరులోని అరండల్‌పేట స్టేషన్లో కస్టడీలో ఉండగా, అతని మేనల్లుడు లోపలికి ప్రవేశించగానే అనిల్ చిరునవ్వు చిందిస్తూ 'ఏంట్రా అల్లుడు ఏం చేస్తున్నావంటూ' పలకరించి, తన పక్కనే కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. కొద్ది సేపు ఆ బాలుడి చెవిలో గుసగుసలాడడం వీడియోలో కనిపించింది.
Borugadda Anil Kumar CCTV Video Viral : తనపై ఐటీ యాక్టులు ఎలా పెడతారు అంటూ అనిల్ ప్రశ్నిస్తున్న మాటలు వినిపించాయి. వారి పక్కనే మరో కుర్చీలో స్టేషన్ కానిస్టేబుల్ కూర్చొని ఉన్నారు. కాసేపటికి ఎదురుగా టేబుల్‌పై ఉన్న పేపర్ తీసుకు వచ్చి ఇవ్వాలంటూ అనిల్ ఆజ్ఞాపించగా, కానిస్టేబుల్ తెచ్చి ఇచ్చారు. స్టేషన్లో ఉన్న ఓ పేపర్‌ను బయటకు తీసి ఆ బాలుడికి చూపించారు. అది ఎఫ్ఐఆర్ కాపీనా, ఇంకేదైనా డాక్యుమెంటా అన్నది తేలాల్సి ఉంది. పోలీస్ స్టేషన్లో ఎక్కడేం జరిగినా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పరిశీలించేందుకు ఎస్ఐకు యాక్సెస్ ఉంటుంది. ఈ తతంగం అంతా రికార్డు అయి, బయటకు వచ్చాక కూడా స్పందించకపోవడం గమనార్హం.
నిందితుడికి దిండు, దుప్పటి - స్టేషన్లో వీఐపీ మర్యాదలు - సీఐ సస్పెన్షన్