BORUGADDA ANIL KUMAR ARRESTED: వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై దూషణలతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ను బుధవారం రాత్రి గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో విచారించిన అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అనిల్‌ను ఐదో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా ఈ నెల 29 వరకు రిమాండ్ విధించారు. అనిల్‌ను రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.
బోరుగడ్డ అనిల్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు దందాలు, దౌర్జన్యాలకు పాల్పడటమే కాక చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌ను నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించారు. ఎన్నికల ఫలితాల వెల్లడైన తర్వాత రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అనిల్‌ని గుంటూరు పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. విచక్షణ లేకుండా సభ్య సమాజం సిగ్గు పడేలా జగన్ హయాంలో ప్రతిపక్ష నేతలపై నోటికొచ్చినట్లు దూషణలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్ ఎట్టకేలకు గుంటూరు పోలీసులకు చిక్కారు.
తనపై ఉన్న కేసుల దృష్ట్యా పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో ఎన్నికల ఫలితాల మరుసటి రోజు అజ్ఞాతంలోకి వెళ్లిన బోరుగడ్డ మూడు నెలలుగా పొరుగు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో రెండు రోజుల కిందట గుంటూరులోని వేళంగిణి నగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.
గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అయ్యారు. కానీ జగన్‌కు తొత్తుగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతలపై సభ్యసమాజం తలదించుకునేలా సామాజిక మాధ్యమాలు, టీవీ డిబెట్‌లలో దూషణలు చేస్తూ హల్‌చల్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో జగన్‌కు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవారు. చంపేస్తానంటూ బెదిరింపులకు దిగేవారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
బోరుగడ్డ అనిల్ అరెస్ట్ - వైఎస్సార్సీపీ హయాంలో రెచ్చిపోయిన నిందితుడు
గతంలో జగన్ పేరు చెప్పి అనిల్‌కుమార్ గుంటూరులో దందాలు, దౌర్జన్యాలతో చేశారు. జగన్ పేరు చెబుతుండటంతో పోలీసుల అతని వైపు కన్నెత్తి చూసేవారు కాదు. అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి జగన్‌తో విబేధించి విమర్శలు చేయడంతో ఆయనను ఫోన్‌లో బెదిరించిన అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైనా పోలీసులు పట్టించుకోలేదు. బోరుగడ్డ అనిల్ నివాసం ఉండే బృందావన్ గార్డెన్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ కార్లలో వెళుతూ పెద్దపెద్దగా హారన్‌లు కొడుతూ అపార్టుమెంట్ వాసులకు నరకం చూపారు. వేళాంగణి నగర్‌లో తన ఇంటి మీదుగా వెళుతున్న వారిని అడ్డుకుని తన ఇంటివైపు ఎందుకు చూశారని దాడి చేశారు.
స్థానికులు ఎదురు తిరిగితే పోలీసులు అనిల్‌కు రక్షణగా నిలిచారే కానీ కేసు నమోదు చేసేవారు కాదనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తన అనుచరులకు సకాలంలో వైద్యం చేయలేదని విధుల్లో ఉన్న జూనియర్ వైద్యులపై దాడికి దిగి వీరంగం సృష్టించారు. అప్పుడు జూడాలు రెండు రోజుల పాటు ఆందోళన చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అనిల్‌పై గుంటూరుతో పాటు అనంతపురంలో కూడా ఒక కేసు నమోదైంది. అనుచరులతో కలిసి ఉద్దేశపూర్వకంగా వెళ్లి గాయపరచడం, అమ్మాయిలను ఈవ్‌టీజింగ్ చేయడం వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.
2021లో అనిల్‌కుమార్ తనని 50లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరించారని కర్లపూడి బాబు ప్రకాష్ అనే వ్యక్తి అరండల్‌పేట ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ వైఎస్సార్సీపీ అధికారంలో ఉండటంతో అనిల్‌ను అరెస్ట్ చేయడానికి సాహసించలేదు. అంతేకాక అరండల్‌పేట, పట్టాభిపురం, కొత్తపేట, పాత గుంటూరు, తాడికొండ, తుళ్లూరు పోలీస్ స్టేషన్లలోనూ అనిల్‌పై కేసులు ఉన్నాయి. అరండల్‌పేట ఠాణాలో ఉన్న రౌడీషీట్‌ని పట్టాభిపురం ఠాణాకు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ని అరెస్టు చేసిన పోలీసులు నల్లపాడు ఠాణాకు తరలించి విచారిస్తున్నారు. తన భర్తని అక్రమంగా అరెస్టు చేశారని అనిల్ భార్య ఆరోపించారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు - దర్యాప్తునకు సహకరించాలని సజ్జలకు హైకోర్టు ఆదేశం - AP HC on Sajjala Bail Petition