Bomb Threats to Hotels in Tirupati : ఇటీవల పలు విమానాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఏపీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్‌లో బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎక్కడా పేలుడు పదార్థాలు లేవు :"తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్‌కు జైలు శిక్ష పడింది. ఈ శిక్ష పడేందుకు తమిళ సర్కార్ తరఫున సీఎం స్టాలిన్ సహకారం అందించడం మాకు నచ్చలేదు. సీఎం కుటుంబంతో పాటు రాష్ట్రంలోని పాఠశాలల్లో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అలాగే తమిళనాడుకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం తిరుపతిలో పలు హోటళ్లను కూడా పేల్చేస్తాం’ అని మెయిల్‌లో దుండగులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమై వెంటనే తనిఖీలు చేపట్టగా ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.