Bomb Threat to IndiGo Flight from Hyderabad to Visakha: దేశంలో విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా బాంబు బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ - విశాఖ - ముంబై విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్వ్కాడ్ లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి చివరకు అందులో బాంబు లేదని నిర్ధారించారు. దాదాపు మూడున్నర గంటల అలస్యంగా తిరిగి విమానం ముంబై వెళ్లేందుకు సిద్దం చేశారు. కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు హైదరాబాద్ నుంచి విశాఖ ఇండిగో విమానం చేరుకుంది. తిరిగి యధావిధిగా నిర్ణీత సమయానికి తిరిగి ఈ విమానం ముంబై పయనమైంది. ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక అగంతకుడు ఫోన్ చేసి హైదరాబాద్- విశాఖ- ముంబై విమానంలో బాంబు ఉందని చెప్పాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెనువెంటనే విశాఖలో రన్ వే నుంచి టేకాఫ్ అయి ముంబైకి పయనమై 10 నిమిషాలకు పైగా అయినప్పటికి తిరిగి దానిని వెనక్కి రప్పించారు. ప్రయాణికులందరిని దింపేసి క్షుణ్ణంగా తనికీ చేసి బాంబు లేదని నిర్దారించారు. 3 గంటలకు పైగా అలస్యంగా ఈ విమానాన్ని తిరిగి ముంబై బయలుదేరుతోందని విశాఖ ఎయిర్ పోర్టు వర్గాలు వివరించాయి.