Free Gas Cylinders Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఒక సిలిండర్ సబ్సిడీ మొత్తం రూ.895 కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబరు 31వ తేదీన ఒక ఉచిత సిలిండర్ లబ్దిదారులకు ప్రభుత్వం ఇవ్వనుంది. ఏడాదికి 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు రూ.2684 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా తెరచిన ఖాతాకు ఈ మొత్తం నిధులను జమ చేయనుంది. ఉచిత సిలిండర్‌కు సంబంధించిన నిధులు డీబీటీ ద్వారా జమ చేయాలని నిర్ణయించింది. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా నగదు బదిలీతో లబ్దిదారు ఖాతాకు జమ చేయనుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి జి.వీరపాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్రీ గ్యాస్ సిలిండర్ కావాలా - ఇలా బుక్ చేసుకోండి
Free Gas Eligibility: సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అర్హతలను సైతం ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేవలం ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందేందుకు అర్హత కలిగిన ఎల్పీజీ కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. ఏపీలో దాదాపు కోటి 55 లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
29 నుంచే ఉచిత గ్యాస్ బుకింగ్: అక్టోబర్ 31 డెలివరీ రోజుగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం, ఫస్ట్ ఫ్రీ గ్యాస్ సిలిండర్‌ని మార్చి 31 వరకూ ఎప్పుడైనా పొందవచ్చని పేర్కొంది. 29వ తేదీ నుంచి గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
48 గంటల్లోపు డబ్బులు జమ: ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం 3 ఆయిల్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. బుకింగ్ చేసిన 24 నుంచి 48 గంటల్లోపే ఇంటికి గ్యాస్ డెలివరీ అవుతుంది. అదే విధంగా 48 గంటల్లోపు లబ్దిదారుల అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయి. ఎవరికి అయినా సరే ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందకపోతే టోల్‌ఫ్రీ నెంబర్-1967కి ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు.
"దీపావళి ధమాకా" ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు - కేబినెట్ ఆమోదం