ACB Raids at APMDC Office in Vijayawada : గనులశాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి కేసులో ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. విజయవాడలోని APMDC కార్యాలయంలో మరోసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇసుక, ఇతర అంశాలకు సంబంధించిన టెండర్ల వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఖనిజాభివృద్ధి శాఖ ఎండీగా వెంకటరెడ్డి పనిచేసిన సమయంలో ఉన్న కొందరు ఉద్యోగస్తులు, అధికారుల నుంచి సమాచారం రాబడుతున్నట్లు తెలిసింది. ఇసుక టెండర్ల సమయం ముగిసిన తర్వాత కూడా కొన్ని కంపెనీలు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించలేదు. అయినా వారికి బాండ్లు తిరిగి ఇచ్చారు.
దీంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని గనులశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ గనుల శాఖ మాజీ డైరక్టర్ వెంకటరెడ్డిని గతంలో అరెస్ట్ చేసింది. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వెంకటరెడ్డిని కొద్దిరోజుల క్రితం ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకొని మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రస్తుతం మరింత లోతుగా అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ఏ విధంగా జరిగింది? ఎవరి ఆదేశాలతో జరిగింది ? అనే అంశాలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు.
ఇసుక కుంభకోణం కేసులో అరెస్టైన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని మూడు రోజుల పాటు విచారించినప్పుడు ఏసీబీ అధికారులు సుమారు 60 ప్రశ్నలు సంధించారు. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు వేల కోట్ల రూపాయల మేర అనుచిత లబ్ధి కలిగించడం వెనుకున్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు అనేక అంశాలపై ప్రశ్నలను అడిగారు. ఈ కుంభకోణంలో రూ. 2,600 కోట్ల మేర దోచుకున్నట్టు ప్రాథమికంగా తేల్చిన ఏసీబీ దీనికి మూలం ఎక్కడుంది, సూత్రధారులెవరు అనే దానిపై ప్రధానంగా వెంకటరెడ్డిని ప్రశ్నించింది.
ప్లీజ్ నన్ను ఏమి అడగొద్దు - వాళ్ల పేర్లు చెప్పలేను - ACB Inquiry on Venkata Reddy
ఎవరి ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో ఇసుక అక్రమాలకు పాల్పడ్డారో కూపీ లాగేందుకు ఏసీబీ ప్రయత్నించింది. వెంకటరెడ్డి మాత్రం మూడు రోజులు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. ఉన్నత స్థాయి ఆదేశాల మేరకు వ్యవహరించాననే చెప్పుకొచ్చారు. ఏసీబీ అడిగిన కొన్ని ప్రశ్నలకే సమాధానమిచ్చిన వెంకటరెడ్డి మరికొన్నింటిని దాటవేశారు. ఇంకొన్నింటికి నర్మగర్భంగా జవాబిచ్చారు. వెంకటరెడ్డి మూడు రోజుల కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం విజయవాడ జైల్లో ఏసీబీ అధికారులు అప్పగించేశారు. ఆ మూడు రోజుల విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ప్రస్తుతం APMDC కార్యాలయంలో మరోసారి అధికారులు తనిఖీలు చేపట్టారు.