Boat Transport on Godavari from Rayanigudem to Parnashala :ఏదైనా ప్రదేశానికి వెళ్లడానికి రోడ్డు, నది మార్గాలు ఉంటే ప్రజలు ఎక్కువగా నీటిలో పడవలో ప్రయాణించడానికి ఇష్టపడుతుంటారు. పైగా పడవలో వెళ్తే సమయం ఆదా అవుతుందంటే ఎవరు కాదంటారు చెప్పండి. అందరూ పడవలోనే వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే పర్ణశాలకు వెళ్లేందుకు భక్తులు, ప్రజలు పడవ ప్రయాణాన్ని కోరుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలకు పడవపై ప్రయాణం చాలా సులువు. రోడ్డు మార్గం కంటే మణుగూరు నుంచి గోదావరిపై పడవలో వెళ్తే చాలా దగ్గర. ఇప్పటికీ చాలామంది జనం మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవలపై వెళ్తున్నారు.
పర్ణశాలకు పడవపై కేవలం 15 నిమిషాలే :ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ గోదావరి నదిపై పడవ ప్రయాణం చేస్తూ పర్ణశాలకు వెళ్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని భక్తులు అంటున్నారు. పర్ణశాలకు వెళ్లేందుకు మణుగూరులోని గోదావరి వద్ద పడవ ప్రయాణం అవకాశాలు కల్పించాలంటూ స్థానికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. పడవ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య పెరగటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా లభిస్తుంది. మణుగూరులోని రాయిగూడెం నుంచి పర్ణశాలకు పడవపై కేవలం 15 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గం ద్వారా అయితే దాదాపు గంటన్నర సమయం పడుతుంది.