Boat Destroyed Rs 40 Lakhs Worth Property Loss At Visakha Appilondalu :ఎన్నో ఆశలతో చేపల వేటకు బయలుదేరిన వారికి ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరారు. రోజూ మాదిరిగానే చేపల వేటకు బయలుదేరారు. ఆడుతూ పాడుతూ సముద్రం ఒడిలో సాగిపోతున్నారు. బోటు యజమాని ఆనందంగా బోటును నడిసముద్రానికి సాగనంపాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కడలి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది.
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపలు వేట కోసం పూడిమడక వైపు వెళ్లిన బోటు ప్రమాదానికి గురైంది. దూడ దాసు అనే మత్స్యకారుడికి చెందిన మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు చేపల వేట చేస్తుండగా అప్పికొండ తీరం వద్ద ప్రమాదానికి గురైంది. సముద్రంలో అలలు తాకిడి ఎక్కువగా ఉండటంతో ఫిషింగ్ బోటు తీరానికి కొట్టుకొని వచ్చింది. కెరటాల తీవ్రత కారణంగా బోటు ధ్వంసం కావడంతో ఆందోళనకు గురైన మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు రక్షించుకున్నారు. తీరం వద్ద అలల ఉధృతికి ఫిషింగ్ బోటు పూర్తిగా ఒక్క ముక్కలైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ సుమారు 40 లక్షలు విలువైన ఫిషింగ్ బోటు ధ్వంసమైంది.
బాధిత మత్స్యకార బోటు యజమానికి నష్టపరిహారం అందించే విధంగా మత్స్య శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కోరుతామని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ భరోసా ఇచ్చారు.