How to Apply Birth Certificate in Telangana :ఆధార్, పాన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం మాదిరిగానే.. బర్త్ సర్టిఫికెట్ కూడా చాలా అవసరం. ఇది శిశువు జన్మించినప్పుడు ప్రభుత్వం జారీ చేసే మొదటి ధ్రువీకరణ పత్రం. ముఖ్యంగా.. విద్యా సంస్థల్లో ప్రవేశం, ఆధార్ దరఖాస్తు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు నమోదు, వివాహాల రిజిస్ట్రేషన్, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ/ స్థానిక ప్రభుత్వాల ఉద్యోగ నియామకాలకు, కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. అయితే.. ఇంతకీ ఈ సర్టిఫికెట్‌కు ఏవిధంగా అప్లై చేసుకోవాలి? ఏ ఏ పత్రాలు అవసరం? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జనన మరణాల చట్టం 1969 ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద శిశువు పుట్టిన 21 రోజుల్లోపు బిడ్డ జననాన్ని నమోదు చేయడం తప్పనిసరి. తెలంగాణలో జనన నమోదు కోసం జీహెచ్ఎంసీ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు సంబంధిత అధికారులుగా ఉంటారు.
ఈ వివరాలు నమోదు చేయడానికి ఎవరెవరూ బాధ్యులుగా ఉంటారంటే?
- హాస్పిటల్లో ప్రసవం జరిగితే.. మెడికల్ ఇన్ఛార్జ్ శిశువు జననాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
- ప్రసూతి గృహం, నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జననం జరిగితే.. వైద్యాధికారి జననాన్ని నమోదు చేయడానికి అర్హులుగా ఉంటారు.
- గ్రామీణ ప్రాంతాల్లో జరిగే జననాన్ని నమోదు చేయడానికి.. ఇన్ఛార్జ్ పోలీసులు, గ్రామ పెద్దలు అర్హులుగా ఉంటారు.
- ఇంట్లో ప్రసవం జరిగితే.. ఇంటి పెద్దలు బిడ్డ జననాన్ని నమోదు చేయాలి.
- ఒకవేళ మహిళ ఏదైనా కారణం చేత జైలులో ఉన్నప్పుడు డెలివరీ జరిగితే.. ఆ టైమ్‌లో జైలుకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న అధికారి శిశువు జననాన్ని నమోదు చేసుకోవాలి.
అవసరమైన ధ్రువపత్రాలు :
- పేరెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్
- తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రం లేదా పదో తరగతి మెమో
- తల్లిదండ్రుల వివాహ ధ్రువీకరణ పత్రం
- ఆసుపత్రి లేదా వైద్య సంస్థచే జారీ అయిన పిల్లల జనన రుజువు