తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో ప్రశ్నార్థకంగా పోలవరం నిర్మాణం - చంద్రబాబు సర్కార్‌కు బిగ్ టాస్క్ ! - Polavaram Construction Updates

Polavaram Project Issue in AP : ఏపీలో కొత్తగా ఏర్పాటైన టీడీపీ సర్కార్‌కు అతి పెద్ద సవాలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటమే. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను సవాలుగా మారింది. ఇది పూర్తైతే ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. పోలవరం నిర్మాణం పూర్తి చేయడం ఈ ప్రభుత్వానికి పెద్ద పరీక్ష కానుంది.

Polavaram Construction Updates
Polavaram Construction Updates (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 16, 2024, 10:15 AM IST

ప్రశ్నార్థకంగా మారిన పోలవరం కీలక కట్టడాలు (ETV Bharat)

Polavaram Construction is Major Challenge for TDP Govt :ఆంధప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు కీలక కట్టడాల సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ ఎన్నింటిని కొత్తగా నిర్మించాలి ఎన్నింటికి మరమ్మతులు చేయాలి అనే విషయాన్ని ముందుగా తేల్చాల్సి ఉంది. ప్రాజెక్టు అంచనాలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం నిర్మాణం పెద్ద పరీక్ష కానుంది.

పెను సవాలుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం :పోలవరం ప్రాజెక్టు అనేక సాంకేతిక సమస్యలతో ఓ పెను సవాలుగా మారింది. ఒక్క స్పిల్‌ వే నిర్మాణం తప్ప మిగిలిన కట్టడాల భవితవ్యం అంతా ప్రశ్నార్థకంగానే మిగిలింది. మొదలుపెట్టిన చోటుకే మళ్లీ వచ్చాం అన్నట్లుగా ఉంది పరిస్థితి. వీటన్నింటినీ ఓ కొలిక్కి తీసుకొచ్చి ప్రాజెక్టు నిర్మాణ పనులను గాడిలో పెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ముందున్న పెద్ద సవాలు. క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌లో దిట్టగా పేరుగాంచిన సీఎం ఈ ప్రాజెక్టులో ఒక్కో అంశాన్ని పరిష్కరించాలి.

పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ స్థాయి నిపుణులు కావాలని కేంద్ర జలసంఘమే తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ, పోలవరం అధికారులు, కేంద్ర జలసంఘం, అనేక ఇతర కేంద్ర సంస్థలు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్, అంతర్జాతీయ నిపుణులు కలిసి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు హయాంలో నిర్మించిన డయాఫ్రం వాల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు ఎంతవరకు భద్రంగా ఉన్నాయో తేల్చాలి. డయాఫ్రం వాల్‌ కొత్తగా నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.

Polavaram Project Construction Updates : కాఫర్‌ డ్యాంలు, గ్యాప్‌ 1 ప్రధాన డ్యాం మళ్లీ నిర్మించాలా మరమ్మతులు సరిపోతాయా అన్నది కీలకాంశం. జగన్‌ హయాంలో పోలవరంలో ఏ స్థాయి విధ్వంసం జరిగిందో తేల్చాలి. నిపుణుల సాయంతో వాటికి పరిష్కారాలు కనుక్కోవాలి. తర్వాత నిర్మాణం దిశగా అడుగులు వేయాలి. మరోవైపు కేంద్రం నుంచి అవసరమైన నిధులూ సాధించాలి. రెండో డీపీఆర్‌ మంజూరు 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.

గోదావరిలో మట్టి స్వభావం వల్ల నది మధ్యలో స్పిల్‌ వే నిర్మించే ఆస్కారం లేకపోయింది. దీంతో నది ప్రవాహమార్గాన్ని మార్చి, కొండలు ఉన్నచోట ఊళ్లన్నీ ఖాళీ చేయించి, అక్కడ స్పిల్‌ వే నిర్మించారు. గోదావరి మధ్యలో ప్రధాన డ్యాం నిర్మించాలి. ఆ కట్ట దిగువన డయాఫ్రం వాల్‌ విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ప్రధాన డ్యాం నిర్మించేందుకు వీలుగా ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు నిర్మించారు.

2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు :ప్రధాన డ్యాంకు అటూ, ఇటూ రెండు గ్యాప్‌లు ఉంటాయి. అక్కడ కూడా రెండు డ్యాలు నిర్మించారు. ఒకటి పూర్తిగా కాంక్రీటు కాగా మరొకటి రాతి, మట్టికట్ట. ఈ అన్నింటిలో ఒక్క స్పిల్‌ వే తప్ప మిగిలిన అన్నింటి సామర్థ్యం, నాణ్యత ప్రశ్నార్థకమయ్యాయి. జగన్‌ హయాంలో ఏడాది పాటు పనులు చేయకపోవడం, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణం సకాలంలో చేయకపోవడంతో 2020 భారీ వరదల నుంచి సంక్షోభాలు ప్రారంభమయ్యాయి.

అత్యంత కీలక కట్టడం డయాఫ్రం వాల్‌ : ప్రాజెక్టులోనే ప్రాజెక్టులోనే అత్యంత కీలక కట్టడం డయాఫ్రం వాల్‌. చంద్రబాబు హయాంలో విదేశీ కంపెనీ బావర్‌తో ఈ పనులు చేయించారు. నదీగర్భంలో 70 మీటర్ల లోతు నుంచి ఈ కట్‌ ఆఫ్‌ వాల్‌ నిర్మించాల్సి వచ్చింది. జగన్‌ హయాంలో ఈ నిర్మాణాన్ని వరదల నుంచి రక్షించలేకపోయారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉన్న గ్యాప్‌లను సకాలంలో పూడ్చకపోవడంతో 2020 వరదలకు ఈ డయాఫ్రం వాల్‌ ధ్వంసమైంది.

జాతీయ జలవిద్యుత్‌ పరిశోధన కేంద్రం దీని సామర్థ్యంపై పరీక్షలు చేసింది. దెబ్బతిన్న ప్రాంతంలో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించి, దాన్ని పాత వాల్‌కు యూ ఆకారంలో అనుసంధానించాలని సూచించింది. లేకపోతే కొత్తది నిర్మించాలని సిఫార్సు చేసింది. బావర్‌ కంపెనీ కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించడమే మేలని పేర్కొంది. దీనిపై నిపుణులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుంది.

ప్రధాన డ్యాం నిర్మించే ప్రాంతానికి ఎగువన, దిగువన నీరు మళ్లించేందుకు నిర్మించిన తాత్కాలిక కట్టడాలే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు. చంద్రబాబు హయాంలో కొంత, ఆ తర్వాత మరికొంత పూర్తయ్యాయి. ఈ రెండూ పూర్తయినా వాటినుంచి నీరు లీకవుతోంది. దీంతో వరదల సమయంలో ప్రధాన డ్యాం ప్రాంతమంతా నీటితో నిండిపోతోంది. కేంద్ర నిపుణులు హెచ్చరించినా జగన్‌ సర్కార్‌ హయాంలో వీటి నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.

మళ్లీ డయాఫ్రం వాల్‌ నిర్మాణం : ప్రస్తుతం మళ్లీ డయాఫ్రం వాల్‌ నిర్మించుకోవాలి. ఇందుకు రెండు సీజన్ల సమయం పడుతుంది. ఆపైన మళ్లీ ప్రధాన డ్యాం నిర్మించాలి. అంటే ఎంత లేదన్నా ఐదేళ్లు పడుతుంది. అప్పటివరకు ఈ కాఫర్‌ డ్యాంలు వరదలను తట్టుకోవాలి. కానీ ఇప్పుడే సీపేజీతో ముంచెత్తుతున్నాయి. వీటి విషయంలోనూ నిపుణులు నిర్ణయాలు తీసుకోవాలి. పోలవరంలో ప్రధాన డ్యాం మూడు భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండోభాగం చాలా పెద్ద డ్యాం. గ్యాప్‌ 3లో ఇప్పటికే కాంక్రీటు డ్యాం నిర్మాణం పూర్తయింది. గ్యాప్‌ 1లో రాతి, మట్టికట్ట డ్యాంగా కొంతమేర నిర్మాణం జరిగింది. గ్యాప్‌ 1లో 565 మీటర్ల మేర రాతి, మట్టికట్ట నిర్మాణంలో భాగంగా వైబ్రోస్టోన్‌ కాలమ్‌ల నిర్మాణం చేపట్టారు.

పోలవరంలో గైడ్‌బండ్‌ కుంగడానికి కారణాలను కమిటీ తేల్చింది. ఒకే సీజన్‌లో కాకుండా వేర్వేరుగా నిర్మించడం వల్ల, స్టోన్‌ కాలమ్స్‌లో బంకమట్టి చేరి గైడ్‌బండ్‌ దెబ్బతిందని కేంద్రం నియమించిన కమిటీ చెప్పింది. ఇప్పుడు ఈ ప్రధాన డ్యాం మొదటి భాగంలోనూ స్టోన్‌కాలమ్స్‌ అలాగే నిర్మించారు. తర్వాత వరదలు వచ్చాయి. గైడ్‌బండ్‌లో చేరినట్లు ఇక్కడా బంకమట్టి రేణువులు చేరి ఉంటే ఈ కట్టడం నాణ్యతా ప్రశ్నార్థకమేనని కమిటీ తేల్చింది. ఈ అంశాన్నీ మరింత లోతుగా అధ్యయనం చేయాలి.

అగాధాల అంశం తేల్చాలి : పోలవరంలో స్పిల్‌ వేపై ప్రవాహ ఒత్తిడి తగ్గించేందుకు గైడ్‌బండ్‌ నిర్మించాలని కేంద్ర సంస్థలు సిఫార్సు చేశాయి. రూ.80 కోట్లతో నిర్మించగా అది కుంగిపోయింది. డిజైన్లకు అనుగుణంగా నిర్మాణం చేపట్టలేదని కట్‌ ఆఫ్‌ వాల్‌లో 105 ప్యానళ్లు ఉండగా 42 దెబ్బతిన్నాయని కమిటీ తేల్చింది. ఈ నిర్మాణం విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలు తేల్చాల్సి ఉంది. ప్రధాన డ్యాం నిర్మించేచోట పెద్ద పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. 2020 వరదలకు ఎగువ కాఫర్‌ డ్యాం గ్యాప్‌ల మీదుగా భారీ వరద ప్రవాహంతో ఇవి ఏర్పడ్డాయి. దీంతో అక్కడ భూభౌతిక పరిస్థితులు మారిపోయాయి. ఆ ప్రాంతంలో ఇసుక సాంద్రత పెంచేలా వైబ్రో కాంపాక్షన్‌ పనులు చేస్తున్నారు. మధ్యలో మళ్లీ వరదలు వచ్చి, అక్కడంతా నీరు నిండిపోయింది. ఈ అగాధాల అంశం తేల్చాలి.

పోలవరం ప్రాజెక్టుకు ఇంతవరకు రెండో డీపీఆర్‌ను కేంద్రం మంజూరు చేయలేదు. చంద్రబాబు హయాంలో రూ.55,656 కోట్లకు కేంద్ర జలసంఘం ఆమోదించింది. తర్వాత రివైజ్డ్‌ కాస్ట్‌కమిటీ రూ.47,725,74 కోట్లకు సిఫార్సు చేసింది. ఆ నిధులకు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. మరోవైపు జగన్‌ హయాంలో తొలిదశ నిధులు అంటూ 41.15 మీటర్ల స్థాయి పునరావాసాన్ని, భూసేకరణను పరిగణనలోకి తీసుకుని, కట్టడాల కాలువల విషయంలో యథాతథ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని రూ.31,625 కోట్లకు కేంద్ర జలసంఘం సిఫార్సు చేసింది. ఆ నిధులతో పోలవరం పూర్తిచేయడం సాధ్యం కాదు. తాజాగా ధ్వంసమైన కట్టడాల నిర్మాణానికి అదనపు నిధులు అవసరం. ఆ నిధులన్నీ కలిపి సాధించాలి.

అనుభవం ఉన్న నిపుణులు అవసరమన్న కేంద్ర జలసంఘం : పోలవరంలో ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాలంటే అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణులు అవసరమని కేంద్ర జలసంఘం తేల్చింది. ఇందుకోసం (ఇంటర్నేషనల్‌ డిజైన్‌ ఏజెన్సీ) ఐడీఏ సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. దాంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించింది. ఆ ఏజెన్సీ తరచూ ప్రాజెక్టును సందర్శిస్తూ ప్రస్తుత సవాళ్ల పరిష్కారానికి డిజైన్లు ప్రతిపాదించాలి. రాష్ట్ర జలవనరులశాఖ, పీపీఏతో అనుసంధానం చేసుకుంటూ డిజైన్లు ప్రతిపాదిస్తే వాటిని కేంద్ర జలసంఘం, రాష్ట్ర జలవనరులశాఖ, పీపీఏ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జలసంఘం నిర్ణయించింది. ఈ విషయంలోనూ తుది నిర్ణయాలు తీసుకోవాలి.

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం.. నాలుగైదు రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక

POLAVARAM GUIDE BUND కుంగిపోయిన పోలవరం గైడ్​బండ్​.. నదీ ప్రవాహ మళ్ళింపులో కీలకమదే

ABOUT THE AUTHOR

...view details