Bhadrachalam Sita Rama Kalyanam :ఇక్ష్వావు వంశ తిలకుడు, రఘుకుల సోముడైన భద్రాద్రి రాముడి కల్యాణానికి ముహూర్తం ఖరారైంది. ఏటా భద్రాచలంలో గోదావరి నదీ తీరంలో జరిగిన ఆ బ్రహ్మండ నాయకుడి వివాహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 6న నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం వార్షిక షెడ్యూల్ను విడుదల చేసింది.
2025లో ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా సీతారాములవారి వార్షిక కల్యాణం జరుపనున్నారు. ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆరో తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో జానకీరాముల కల్యాణం, రాత్రి చంద్రప్రభ వాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తీరువీధి సేవ ఉంటుంది. ఏప్రిల్ 7వ సంవత్సరానికి మహా పట్టాభిషేకం నిర్వహిస్తారు.
రూ.120కి క్యాలెండర్ :భద్రాచలం ఆలయ 2025 సంవత్సరం క్యాలెండర్‌ను రామాలయం ఈఓ రమాదేవి, ప్రధానార్చకుడు విజయరాఘవన్ ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ ఏడాది 10వేల క్యాలెండర్లను ముద్రించారు. ఒక్కోదాని ధర రూ.120 అని పేర్కొన్నారు. ఇందులో పండుగలతో పాటు రామాలయంలో విశేషంగా నిర్వహించే ఉత్సవాలు, స్వామివారి వేడుకల చిత్రాలు, అనుబంధ కోవెలలోని విగ్రహాల చిత్రాలతో క్యాలెండర్ రూపొందించారు.
డైరీ సైతం : రూ.75 ధరతో రామాయల డైరీని సైతం తీసుకొచ్చారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రాద్రి ఆలయ అధికారులు సౌకర్యాలను మెరుగు పరుస్తున్నారు. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న సమయంలో ఆ టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. భక్తుల సంఖ్య ఆధారంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆ సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా వివరించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త వహిస్తున్నారు. కాగా ఇటీవల భద్రాద్రి స్పెషల్ దర్శననాన్ని పునరుద్దరించారు.
2025లో భద్రాచలంలోని ముఖ్య ఉత్సవాలు ఇలా ఉన్నాయి :
- జనవరి 9న గోదావరిలో హంస వాహనంలో తెప్పోత్సవం
- 10న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శన పూజలు
- ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు శ్రీ భక్త రామదాసు 392వ జయంత్యుత్సవాలు, వాగ్గేయకారోత్సవాలు మార్చి 14న పసుపు కొమ్ములను దంచి తిరు కల్యాణ తలంబ్రాలు, అదే రోజు వసంతోత్సవం, డోలోత్సవం
- 30న శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాల ప్రారంభం.
- ఏప్రిల్ 2న ధ్వజపట లేఖనం, 3న గరుడాధివాసం, 4న అగ్నిప్రతిష్ఠ, 5న ఎదుర్కోలు, 6న కల్యాణం, 7న పట్టాభిషేకం, 8న సదస్యం, 12న చక్రతీర్థం ఉత్సవాలు జరుపుతారు.
- మే 22న హనుమజ్జయంతి జరుగుతుంది.