BENEFITS WITH SENIOR CITIZEN CARD: మీరు 60 ఏళ్లు దాటిన వాళ్లు అయితే ఖచ్చితంగా సీనియర్ సిటిజన్ కార్డు తీసుకోవాల్సిందే. ఎందుకంటారా ఈ కార్డుతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అది మీ చేతిలో ఉంటే వజ్రాయుధం ఉన్నట్టే. మరి దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అదే విధంగా ఈ కార్డును ఎలా పొందాలో కూడా తెలుసుకుందాం.
ఫ్రీగా కార్డు పొందొచ్చు:సీనియర్ సిటిజన్ కార్డును ఏపీ, తెలంగాణల్లో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందొచ్చు. ఈ కార్డుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలనూ సులభంగా పొందొచ్చు. ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలు చూపించాల్సిన అవసరం లేదు. 2006లో అప్పటి కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ అయ్యింది. అప్పటి నుంచి ఇది అమలవుతోంది. కన్నబిడ్డల నిరాదరణకు గురైన వారు, ఏ ఆదరువూ లేని అనాథ వృద్ధులు ఆశ్రమాల్లో సేవలు పొందేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
టికెట్‌లో 25 శాతం రాయితీ:ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌లో 25 శాతం రాయితీ లభిస్తుంది. దూరప్రాంతాలవి కాకుండా ఇతర ఆర్టీసీ బస్సులలో వృద్ధులకు ప్రత్యేకంగా రెండు సీట్లు రిజర్వ్ చేస్తారు. అదే విధంగా రైల్వేస్టేషన్లలో కూడా వయోవృద్ధులకు స్పెషల్ టికెట్ కౌంటర్లు ఉంటాయి. అవసరమైన వారు వినియోగించుకునేందుకు వీల్‌ఛైర్ సదుపాయం సైతం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు పైగా వయసుండి ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు, గర్భిణులకు లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో ప్రాధాన్యత ఉంటుంది. ఇందుకోసం ఒక్కో స్లీపర్ కోచ్‌లో 6 బెర్త్‌లు కేటాయిస్తారు. థర్డ్ ఏసీలో 4, సెకెండ్ ఏసీలో 3 బెర్త్‌లు రిజర్వ్ చేస్తారు
ఎలా అప్లై చేసుకోవాలి అంటే: 60 ఏళ్లు దాటిన పురుషులు, 58 ఏళ్లు దాటిన మహిళలు ఈ కార్డుకోసం అప్లై చేసుకోవచ్చు. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి. లేదా జిల్లా దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకుల ఆఫీసులోనూ తీసుకోవచ్చు. జిల్లా కార్యాలయంలో అప్లై చేసుకున్న రోజే కార్డును ఇస్తారు. గ్రామాల్లో ఉన్న వారికి వారంలో కార్డుని మంజూరు చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు పాస్‌పోర్టు సైజ్ ఫొటో, వయసును నిర్ధారించేందుకు ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, తదితర సర్టిఫికేట్ సమర్పించాలి. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది.