Benefits of Cool Roofs in Summer : ప్రస్తుతం వేసవి ప్రారంభంలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇళ్లు, కార్యాలయాలు, వాణిజ్య భవనాల్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. చల్లదనం వేసవి కోసం ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. వీటి నిర్వహణ ఖర్చు భరించలేనివారు చలువ పైకప్పు (కూల్ రూఫ్) ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల భవనం లోపల వేడి తగ్గడంతో పాటు విద్యుత్తు ఆదా చేసుకోవచ్చు. కొత్త నిర్మాణాలతో పాటు పాత భవనాలకు ఇది పనికొస్తుంది. దీనివల్ల గది లోపలి 4-5 డిగ్రీలు, పైకప్పు ఉపరితల ఉష్ణోగ్రత 15-18 డిగ్రీలు తగ్గుతుందని నిపుణులు తెలిపారు.
Importance of Cool Roof in Summer: నిర్మాణంలో ఉన్న భవనాలకు ఆధునిక సాంకేతికత ద్వారా పైకప్పు నిర్మాణ సమయంలో ప్రత్యేక రసాయనాలు వాడటం ద్వారా సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతాయి. ఫలితంగా వేడి తగ్గుతుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. ఇది పర్యావరణహితమైనది. మన దేశంలో 6 శాతం మంది ప్రజలు ఏసీలు వాడుతున్నారని మరో పదేళ్లలో ఇది 20 రెట్లు పెరుగుతుందని రీజెన్సీ ఎండీ సత్యేంద్ర ప్రసాద్ అన్నారు. విద్యుత్ వినియోగం పెరిగి ప్రభుత్వాలపై అధిక భారం పడటమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేస్తుందని తెలిపారు.
ఇకపై సమ్మర్‌లోనూ ఇల్లు చల్లగానే.. నేటి నుంచి అమల్లోకి కూల్ రూఫ్ విధానం
Cost of Cool Roof in House: టైల్స్‌ను ఉపయోగించి చలువ పైకప్పు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే చదరపు అడుగుకి రూ.100 నుంచి రూ.120 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇవి 80 శాతం సూర్యకిరణాలను పరావర్తనం చేస్తాయి. విభిన్న రంగులు, డిజైన్‌లు, సైజుల్లో అందుబాటులో ఉన్న వీటిని అమర్చేందుకు చదరపు అడుగుకు రూ.25 నుంచి రూ.60 వసూలు చేస్తున్నారు. కప్పుపై నాచు పేరుకోకుండా శుభ్రం చేసుకుంటూ, వర్షం నీరు నిల్వ లేకుండా చూస్తే 25 ఏళ్ల పాటు ఇవి మన్నికగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఇది వేసవిలోనే కాదు, శీతాకాలంలోనూ ఉష్ణోగ్రతలను హెచ్చుతగ్గులు కాకుండా చూస్తాయని తెలిపారు.