Beautiful Mangroves in Gullalamoda : కనువిందు చేసే మడ అడవుల అందాలు, వంపుసొంపులతో పరవళ్లు తొక్కే కృష్ణవేణీ తరంగాలు, చల్లని చిరుగాలి, వినసొంపైన పక్షుల కిలకిలారావాలు, వాటి మధ్య లాహిరిలాహిరిలో అంటూ సాగే పడవ ప్రయాణం, ఈ మధురానుభూతులు ఆస్వాదించాలంటే నాగాయలంక సముద్ర తీర ప్రాంతంలోని లైట్‌హౌస్‌ను సందర్శించాల్సిందే.
నాగాయలంక మండల పరిధిలోని గుల్లలమోదలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే కృష్ణా నది పాయల మధ్యలో పడవ ప్రయాణం చేయాలి. గుల్లలమోద నుంచి సముద్ర ప్రాంతం వరకు తెల్ల, నల్ల మడ, పొన్న, దుడ్డు పొన్న తదితర రకాల మొక్కలతో మడ అడవులు ఆకర్షణీయంగా విస్తరించి ఉన్నాయి. మడ అడవులు, నది పాయల మధ్య సాగే ఈ పడవ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరుపురాని అనుభూతినిస్తుంది. ఈ ప్రాంతానికి నాగాయలంక, గులల్లమోద, ఎదురుమొండి, సంగమేశ్వరం నంచి ప్రత్యేక పడవల్లో వెళ్లాల్సి ఉంటుంది.
ప్రత్యేక ఆకర్షణగా : రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా ఓ వైపు కృష్ణా నది పాయలు, ఇంకోవైపు బంగాళాఖాతం మధ్య పచ్చని మడ అడవుల నడుమ నాగాయలంక నుంచి 20 కి.మీ. దూరంలో ఉండే గుల్లలమోద లైట్‌హౌస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ లైట్‌హౌస్‌ని 1972లో ఆధునికీకరించారు. 9 అంతస్తులతో గల దీని ఎత్తు 135 అడుగులు. 1977 ఉప్పెనకు 5వ అంతస్తు వరకు వరద నీరు వచ్చినట్లు రికార్డులో నమోదైంది.
రవాణా సదుపాయం కల్పిస్తే పర్యాటకాభివృద్ధి : ప్రసుత్తం ప్రత్యేక పడవల ద్వారా ఈ లైట్‌హౌస్‌ను సందర్శిస్తున్నారు. ఈ ప్రయాణం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం, ఖర్చు ఎక్కువ కావడం వల్ల చాలా మంది ఈ ప్రాంతాన్ని సందర్శించలేకపోతున్నారు. దీనికితోడు మౌలిక వసతులు, ఆహారం అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. పర్యాటకశాఖ ప్రత్యేక పడవలు, లాంచీలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది. ఈ మేరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.