Bathukamma Celebrations During Diwali Festival : బతుకమ్మ పండుగ సరదాగా జరుపుకునేందుకు ఆ గ్రామస్థులు సిద్ధమయ్యారు. తీరొక్క పూలను ఏర్చి కూర్చి అందమైన బతుకమ్మలను పేర్చి ఈసాయంత్రం వీధుల్లో ఆడీ పాడనున్నారు. ఇప్పుడు బతుకమ్మ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవునండీ వందేళ్లకు పైగా తాతల నుంచి వస్తున్న సంప్రదాయమని దాన్ని కొనసాగిస్తున్నామని చెబుతున్నారు హనుమకొండ జిల్లాలోని సీతంపేట గ్రామస్థులు.
దసరా రోజుల్లో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఈ 9 రోజుల పాటు జరిగే ఆ వేడుకల సందడి అంతా ఇంతా కాదు. కానీ హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేట గ్రామస్థులు మాత్రం ఇందుకు భిన్నం. దీపావళి పండుగ రోజుల్లో ఇక్కడ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. వందేళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. మొత్తం మూడు రోజుల పాటు బతుకమ్మ పండుగ ఉత్సవాలు నిర్వహిస్తారు.
నవంబర్ 1 శుక్రవారం తొలి రోజు నేతకాని కులస్ధులంతా చెరువు వద్దకు వెళ్లి రేగడి మట్టి తీసుకొచ్చి జోడెద్దుల ప్రతిమలు తయారుచేస్తారు. గారెలతో వాటిని అందంగా అలంకరించి పురుషులంతా కేదారేశ్వరుడికి పూజలు చేశారు. రెండో రోజైన శనివారం రోజున జోడెద్దుల ప్రతిమలను ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఈ ఉత్సవాల్లో చేసిన పిండి వంటలను పురుషులే వాయినంగా ఇచ్చుకుంటారు. కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు.