Balagokulam Venkat Foundation Provide Shelter For Children :అమ్మ స్ఫూర్తితో : కొవిడ్ లాక్‌డౌన్ కాలం అది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయి ప్రభుత్వ హాస్టల్‌లో తలదాచుకుంటున్న సంతోష్‌ని నిర్వాహకులు వెళ్ళిపొమ్మన్నారు. అతనికి ఆశ్రయమిచ్చి ఇంత ముద్ద పెట్టడానికి బంధువులూ ముందుకు రాలేదు. ఎటు పోవాలో పాలుపోని పరిస్థితిలో కరీంనగర్‌లోని ‘బాలగోకులం’ గురించి తెలిసింది సంతోష్‌కి. ఫోన్ చేసిందే తడవుగా అతణ్ణి అక్కున చేర్చుకున్నారు ఆ సంస్థ నిర్వాహకులు. మూడేళ్ళకిందట ఇక్కడికొచ్చిన సంతోష్ ప్రస్తుతం సివిల్స్ సిద్ధం అవుతున్నాడు. ఇలా గత పదేళ్ళలో ఎంతోమంది అనాథల్ని చేరదీసి ప్రయోజకుల్ని చేసింది బాలగోకులం.
గంపా వెంకటేశ్ వెంకట్ ఫౌండేషన్ (ETV Bharat) Venkat Foundation :ఈ ఏడాది 40 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. 10 ఏళ్ళు పైబడ్డ అనాథలు ఎవరైనా ఇక్కడికి వచ్చి, ఉద్యోగం సాధించేవరకూ ఏ బాదరబందీ లేకుండా ఉండొచ్చు. పిల్లలకి ఇష్టమైన వంటలే చేయాలన్న నిబంధన ఉంది ఇక్కడ. వాళ్ళు బడికో కాలేజీకో వెళ్ళి వచ్చాక ఉదయం సాయంత్రం కోచింగ్ తరగతులూ నిర్వహిస్తారు. కరీంనగర్‌కి చెందిన గంపా వెంకటేశ్ అనే వ్యాపారి ఈ బాలగోకులాన్ని ఏర్పాటు చేశారు. జీవించినంత కాలం అనాథలకీ అభాగ్యులకీ సాయపడుతూనే ఉన్న తన తల్లి స్ఫూర్తితో ఈ ఆశ్రమాన్ని నెలకొల్పినట్లు చెబుతారాయన.‘వెంకట్ ఫౌండేషన్’ పేరుతో నెలకి లక్షన్నర రూపాయల ఖర్చుతో ఈ అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు.
పేదింటి బిడ్డల పెద్ద మనస్సు- ఆపత్కాలంలో అందరికీ ఆత్మీయులు
స్నేహిత అమృత హస్తం సంస్థ స్థాపకుడు మొమ్మెల రాజు (ETV Bharat) Snehitha Amrutha Hastham Trust Foundation : ఇదో నిశ్శబ్ద విప్లవం : కడప జిల్లా పులివెందులకి చెందిన మొమ్మెల రాజు ధనవంతుడేమీ కాదు. స్థానిక బ్లడ్ బ్యాంకులో పనిచేసే మామూలు ఉద్యోగి. అయితేనేం- సమాజాన్ని బాగా ఎరిగినవాడు. నిరుపేదలూ, అనాథలైన పిల్లలు జీవితంలో పైకి వచ్చే అవకాశాలు ఏమేం ఉన్నాయో తెలిసినవాడు. ముఖ్యంగా ‘ఏపీ ఆర్‌జేసీ సెట్’లో చదివితే ఎంతటి పేద విద్యార్థి అయినా మంచి ప్రమాణాలతో కూడిన ఇంటర్ విద్య అందుకోవచ్చని గ్రహించాడు. ‘పాలిసెట్’లో విజయాన్ని అందుకుంటే వృత్తి నిపుణులుగా ఓస్థాయికి ఎదగొచ్చని నమ్మాడు. ఆ రెండింటి కోసం పూర్తి ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ‘స్నేహిత అమృత హస్తం’ అన్న సంస్థని ఏర్పాటు చేశాడు.
పద్నాలుగేళ్ల కిందట ఒక్క టీచర్, పాతికమంది విద్యార్థులతో కేవలం తన జీతంతో ఈ సంస్థని స్థాపించాడు రాజు. ఇప్పటిదాకా సుమారు ఐదువేల మంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చి ప్రవేశపరీక్షలని రాయించాడు. వందలాదిమందికి చక్కటి విద్యాసంస్థల్లో చదివేందుకు మార్గం చూపాడు. ఇప్పటికీ ఏటా 250 మందికి శిక్షణ ఇస్తున్నాడు. ఈ బృహత్కార్య నిర్వహణకు తమ వంతు సాయంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న 35 మంది శిక్షకులు ఇక్కడి కొచ్చి ఉచితంగా శిక్షణ అందించడం విశేషం.
పిల్లలతో స్కంధాన్షి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు (ETV Bharat) Skandhanshi Foundation : ఇంజినీరింగ్, మెడిసిన్ అయినా : కర్నూలు జిల్లాలో ఏ ప్రమాదాలవల్లో తీవ్ర అనారోగ్యం వల్లో ఎవరైనా చనిపోయారన్న వార్తలు వస్తే వెంటనే వాటి ‘కటింగ్స్’ని తీసిపెట్టుకుంటారు ‘స్కంధాన్షి ఫౌండేషన్’ సభ్యులు. మృతుల పిల్లలు ఏమయ్యారా అని అరాతీయడం మొదలుపెడతారు. తల్లిదండ్రులిద్దరూ చనిపోతేనో, ఒక్కరే మిగిలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటేనో ఆ చిన్నారుల్ని అక్కున చేర్చుకుంటారు. కర్నూలు బిర్లా సర్కిల్‌లోని తమ ఆశ్రమానికి తీసుకొచ్చి ఎంతదాకైనా చదివిస్తారు. పేరున్న కార్పొరేట్ బడుల్లోనూ చేర్పిస్తారు.
మానసిక సమస్యలు లేని సమాజమే ధ్యేయం - గుంటూరులో పేదల డాక్టర్
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల్ని చదివించలేని పేద తల్లిదండ్రులకీ కావాల్సిన ధన సహాయం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న పిల్లల్ని ఇంజినీరింగ్, మెడిసిన్ దాకా ఉచితంగానే చదివిస్తున్నారు. వీటన్నింటి కోసం నెలనెలా రూ.70 లక్షల దాకా ఖర్చుచేస్తోంది స్కంధాన్షి ఫౌండేషన్. కె.సురేశ్‌కుమార్‌రెడ్డి ఈ సంస్థ వ్యవస్థాపకుడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి ఆయన స్వస్థలం. అక్కడి నుంచి ఒక్కో మెట్టే ఎదుగుతూ కర్నూలులోనూ బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో విద్యే సమాజాన్ని మార్చే ఆయుధమన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ విద్యని అందుకోలేని అనాథలూ అభాగ్యుల్ని ఆదుకోవాలన్న లక్ష్యంతోనే 2020లో స్కంధాన్షి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. కనీసం 300 మందికైనా ఆశ్రయం కల్పించడమే తన ఆశయమని చెబుతారు.