Baby Kidnap in Guntur GGH :గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మగశిశవును కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోరంట్లకు చెందిన నసీమా అనే బాలింత కాన్పుకోసం ఆదివారం ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఒంటి గంటకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
కిడ్నాప్ చేసిన శిశువును ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మొత్తం నలుగురు శిశువును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో వారిని అరెస్టు చేశారు. మగ శిశువును సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.