AWBI Guidelines on Street Dogs Bite Precautions : హైదరాబాద్ మహానగరంలో వీధికుక్కల చెలగాటం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. జీహెచ్ఎంసీ గణాంకాల ప్రకారం నగరంలో సమారు 6 లక్షలపైగా వీధి శునకాలు ఉంటాయి. సాధారణంగా ఒక కుక్క ఏడాదికి 2 సార్లు సంతానోత్పత్తి చేస్తుంది. దీంతో వీధికుక్కల సంఖ్య సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా(AWBI) మార్గదర్శకాల ప్రకారం బల్దియా వెటర్నరీ విభాగం ప్రతి కుక్కను పట్టుకొని రేబిస్ వ్యాక్సిన్‌తో పాటు సంతాన నిరోధక శస్త్ర చికిత్సలు చేయించాలి. కానీ ఆచరణలో అది అమలు కాకపోవడంతో సామాన్య ప్రజలు కుక్కకాట్లకు బలవుతున్నారు. బల్దియాలో రోజుకు వీధి కుక్కల సమస్యలపై 500 ఫిర్యాదులు అందుతుంటే వాటిలో 10% కూడా పరిష్కరించడం లేదనే ఆరోపణలున్నాయి.
నగరంలో వీధి శునకాలు పసిపిల్లలను, పాఠశాల విద్యార్థులను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అంబర్‌పేట్‌లో వీధి శునకాల దాడిలో పిల్లాడు చనిపోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘటన జీహెచ్ఎంసీ(GHMC)తో పాటు ప్రభుత్వంపై కూడా రాజకీయంగా విమర్శలకు కారణమైంది. ఇది జరిగి ఏడాది గడవక ముందే షేక్‌పేటలో మరో విషాధకర సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయ పర్చడంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కళ్లముందే కుమారుడు చనిపోవడంతో ఆ బాధ తట్టుకోలేని కుటుంబం నగరాన్ని విడిచి స్వగ్రామానికి వెళ్లిపోయింది.
కుక్క కరిచిందా - ఇలా చేయకపోతే మీకు ప్రాణాపాయం తప్పదు!
Experts Suggestions on Street Dogs Bite :అంబర్‌పేట ఘటనపై స్పందించిన మున్సిపల్ శాఖ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం మంజూరు చేసింది. నగర మేయర్ విజయలక్ష్మితో పాటు కార్పొరేటర్ల జీతాల నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని నగరంలో కుక్కల బెడదను నివారించేందుకు 13 అంశాలతో ప్రత్యేకంగా మార్గదర్శకాలను జారీ చేసింది. కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియ(Sterilization Procedure for Dogs)ను వేగవంతం చేయడంతో పాటు నగర వ్యాప్తంగా కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ఘటనలను నియంత్రించాలని ఆదేశించింది. మాంసం విక్రయదుకాణాలు, హోటళ్ల వ్యర్థాలను రోడ్లపై వేయకుండా చూడాలని సూచించింది. కుక్కల స్వభావంపై స్వచ్ఛంద సంస్థ సహకారంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
యానిమల్ కేర్ సెంటర్లు ఏర్పాటు : నగరంలోని అన్ని పాఠశాలల్లో వీది కుక్కల(Street Dogs Attack) పట్ల ఎలా వ్యవహారించాలో విద్యార్థులకు వివరించాలని తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 2025 నాటికి నగరాన్ని రేబిస్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రేటర్‌లోని అన్ని పార్టీల నుంచి ఇద్దరు కార్పొరేటర్ల చొప్పున 8 మందితో ప్రత్యేకంగా హైలెవల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారి నుంచి సలహాలు సూచనలు తీసుకొని 5 జోన్లలో 5 యానిమల్ కేర్ సెంటర్ల(Animal Care Centers)ను ఏర్పాటు చేసింది. అందులో ఫతుల్లాగూడ, చుడిబజార్, పటేల్‌నగర్, కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డు కాలనీ, మహాదేవ్ పూర్‌లో యానిమల్‌కేర్ సెంటర్లలో వీధి శునకాలకు రేబిస్ టీకాలు ఇవ్వడం, సంతాన నిరోధక శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు.
Street Dogs Bite Cases in Hyderabad : హైదరాబాద్‌లోని మణికొండ, షేక్‌పేట, మెహదీపట్నం, కార్వాన్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌తో పాటు అల్వాల్, ఎల్బీనగర్, ఉప్పల్, హయత్ నగర్, శేరిలింగంపల్లి, మణికొండ ప్రాంతాల్లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. హయత్‌నగర్, మూసీనది పరివాహక ప్రాంతాల్లో స్టెరిలైజ్ చేయని వీధి శునకాలు ఎక్కువగా కనిపిస్తాయి. నగరంలో వీధి కుక్కలు రెచ్చిపోవడానికి ప్రధానంగా వాటిని నియంత్రించలేక పోవడం ఒక కారణమైతే పారిశుద్ధ్య సమస్య కూడా మరో కారణంగా మారింది. చాలాచోట్ల చెత్త కుప్పలు పెరుగుతుండటంతో వీధి కుక్కలు అందులోని కుల్లిపోయిన ఆహారాన్ని తింటూ అనారోగ్యాల బారినపడుతున్నాయి. దాంతో అటువైపుగా వెళ్లే వారిపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొందరు చిన్నారులు మృత్యువాత పడుతుండగా మరికొందరు చికిత్సతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నారు.