Police Enquiry on YS Avinash Reddy PA: వైఎస్.సునీత, షర్మిల, విజయమ్మ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి పి. ఏ. రాఘవరెడ్డిని శుక్రవారం రాత్రి 11 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. నాలుగో రోజు కూడా పోలీసులకు సహకరించకుండా సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. అందువల్ల ఈ 17వ తేదీన మళ్లీ విచారణకు రావాలని పోలీసులు 41A నోటీసులు అందజేశారు.
నెల రోజుల తర్వాత బయటకు - పులివెందులలో ప్రత్యక్షమైన అవినాష్ పీఏ రాఘవరెడ్డి
వర్రా రవీందర్ రెడ్డి కేసు: సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నాలుగో రోజు కూడా విచారణను ఎదుర్కొన్నారు. కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాఘవరెడ్డిని పోలీసులు ప్రశ్నించారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ రాఘవరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆడియో, వీడియో సైతం రికార్డ్ చేశారు. ల్యాప్టాప్ ముందు పెట్టి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. సునీత, షర్మిల, విజయమ్మపైన అసభ్యకరమైన పోస్టులు ఎందుకు పెట్టించాల్సి వచ్చిందన్న దానిపై ప్రశ్నించారు. అయితే అలా పోస్టులు నేను పెట్టలేదని అవి ఎవరు పెట్టారో తనకు తెలియదని, అసలు గుర్తు లేదని రాఘవరెడ్డి సమాధానాలు చెప్పారు. రాఘవరెడ్డి దగ్గర ఉన్న రెండు మొబైల్ ఫోన్లు తీసుకురావాలని చెప్పినా అతను వాటిని విచారణకు తీసుకురాలేదు. ఎక్కడో పోయాయని ఫేస్బుక్ బుక్ పాస్వర్డ్, ఐడీ కూడా గుర్తు లేదని రాఘవరెడ్డి తెలియజేశారు. వర్రా రవీందర్ రెడ్డి చేత ఎందుకు ఇలాంటి పోస్టులు పెట్టించావని డీఎస్పీ గుచ్చి గుచ్చి ప్రశ్నించినా సరే అతను ఎవరో తనకు తెలియదని, ఆ పోస్టులతో తనకేం సంబంధం లేదని రాఘవరెడ్డి చెప్పారు. విచారణకు సహకరించకుండా విసిగిస్తున్నారని డీఎస్పీ మురళి నాయక్ అసహనం వ్యక్తం చేశారు.