Corporation Chairperson Kalva Sujatha Press Meet : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మరణించిన రేవతి అనే మహిళ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత తెలిపారు. రేవతి మరణించడం బాధాకరమని అన్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ తల్లిని కోల్పోవడం పట్ల తన సంతాపాన్ని తెలిపారు. ఆ బాలుడి, కుటుంబం బాధ ఎన్ని కోట్లు ఇచ్చిన తీర్చలేనిదని అన్నారు. నటుడు అల్లు అర్జున్ శ్రీతేజ్కు చికిత్స చేయిస్తున్నామని పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఆయన ప్రెస్ మీట్లో చెప్పినవన్నీ అవాస్తవాలేనని దుయ్యబట్టారు.
బహిరంగ క్షమాపణలు చెప్పాలి : ఇప్పటి వరకు సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించిందని తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రభుత్వమే చూసుకుంటుందని వెల్లడించారు. అవసరమైతే విదేశాల నుంచి వైద్యులను రప్పించి మెరుగైన వైద్యం కల్పిస్తామని తెలిపారు. రూ.25 లక్షలు బాధిత కుటుంబానికి ఇచ్చామని అల్లు అర్జున్ అంటున్నారని కానీ కేవలం రూ. 10 లక్షల డీడీలు మాత్రమే ఇచ్చారన్నారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ కచ్చితంగా మృతురాలు రేవతి కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. వారి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇప్పటి వరకు ఆసుపత్రి ఖర్చులన్నీ భరించాము అనే మాటను అల్లు అర్జున్ వెనక్కి తీసుకోవాలి. రూ.25 లక్షలు ఇస్తామని చెప్పి అందులో రూ.10 లక్షలకు మాత్రమే డీడీలు తీసీ వారి కుటుంబాన్ని కోట్ల రూపాయలు ఇచ్చినట్లు బిల్డప్ కొడుతున్నారు. ప్రెస్మీట్లో ఈయన మొత్తం తప్పుడు మాటలు చెప్పారు. ఈ రోజు పోలీసులు వారి పని వారు చేస్తే తప్పుడు పడుతున్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఆర్యవైశ్యుల ఓట్లు అడగటానికి వస్తే రేవతి, శ్రీతేజ్ల ఫోటోలను చూపిస్తాము'.
-కల్వ సుజాత, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్