Arya Vaishya Corporation Chairman Doondi Rakesh Fire On YSRCP Leaders : వైఎస్సార్సీపీ పనైపోయిందని, ఆ పార్టీ నుంచి తలపండిన నాయకులు సైతం బయటకు వెళ్లిపోతున్నారని ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ అన్నారు. ఏదో ఒక పార్టీలోకి వెళ్లేందుకు మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వంటివారు ప్రయత్నిస్తున్నారని, వారిని కూటమి పార్టీల్లో ఎవరూ చేర్చుకోరని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ విద్యాధరపురంలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాకేశ్, వైఎస్సార్సీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ పాలనలో దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్కరినీ పట్టుకున్న పాపానపోలేదని ఆరోపించారు.
వెల్లంపల్లి డ్రామాను ప్రజలు పట్టించుకోరని, ఆయనని ఏ పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా తప్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించినవారిపై చర్యలు తప్పవన్నారు. త్వరలో ఏర్పాటు చేయనున్న ట్రిబ్యునల్ ద్వారా వారిపై విచారణ జరగనుందని వెల్లడించారు. తమకు కక్ష సాధింపు రాజకీయాలు తెలియవని, తెలిసి ఉంటే వైఎస్సార్సీపీ నేతలు బయట తిరిగేవారుకాదని అన్నారు. కేంద్ర బడ్జెట్ చిరు వ్యాపారులకు ఊతమిచ్చేలా ఉందని, ఈ బడ్జెట్ను ప్రజలందరు స్వాగతిస్తున్నారని డూండీ రాకేశ్ చెప్పారు.