Dhimsa Dance at Vishakha Hotels : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరుగుతున్న చలి ఉత్సవాన్ని అతిథిలకు తెలియజెప్పేవిధంగా విశాఖపట్నం స్టార్ హోటళ్ల వద్ద కళాకారులు ప్రదర్శనలు చేేస్తున్నారు. అల్లూరి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు కళాకారులను విశాఖలోని హోటళ్ల వద్ద అతిథులను పలకరించేందుకు అనుమతించారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు, స్ధానికంగా వచ్చే అతిథులను వీరు గిరిజన సంప్రదాయ రీతిలో ఆహ్వానం పలుకుతున్నారు. థింసా నృత్యం వారికి పరిచయం చేసి, వారు కూడా ఈ నృత్యంలో భాగంగా పాదం కలిపేట్టుగా కళాకారులు ఉత్సాహపరుస్తున్నారు.
విభిన్న గిరిజన సంస్కృతులు : ఆంధ్ర ఊటీ అరకులోయలో చలి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అరకు ఉత్సవాలు ఫిబ్రవర్ 2వ తేదీ ఆదివారంతో ముగియనున్నాయి. పర్యాటకులు, స్థానికులు కేరింతల కొడుతూ ఉత్సవాలను ఆస్వాదిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఏడు రాష్ట్రాలకు చెందిన విభిన్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ఉత్సవాలకు వచ్చిన ఆహుతులను అలరిస్తున్నాయి.
తరలివస్తున్న పర్యాటకులు : అరకులో అట్టహాసంగా నిర్వహిస్తున్న చలి ఉత్సవాల్లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఈ ఉత్సవాల కోసం అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివస్తున్న పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హెలికాప్టర్ రైడింగ్, ఫైర్ బెలూన్, ఫ్లవర్ షో తో పాటు గిరిజన నృత్య కళా ప్రదర్శనలు పర్యాటకులను అలరిస్తున్నాయి. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను కళాకృతుల రూపంలో కళ్లకు కట్టే ట్రైబల్ మ్యూజియం సందర్శనకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.