Vontimitta Rama Temple : ఇక ఆ రాములోరి ఆలయంలో వివాహాలు జరగవు. అదేంటి? శ్రీ సీతారాముల ఆలయంలో వివాహాలు జరగకపోవడం ఏంటని భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎక్కడి రామాలయంలో పెళ్లిలు జరగనీయకుండా ఆపేశారో తెలుసా? అదే పక్క రాష్ట్రం ఏపీలోని ఆంధ్రుల భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట కోదండ రాముడి సన్నిధిలో. అదేంటి అలా అని భక్తులు నోరెళ్లబెడుతున్నారు. అసలేం జరిగిందని ప్రశ్నిస్తున్నారు.
కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని భారత పురాతత్త్వ-సర్వేక్షణ శాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు శుక్రవారం టీటీడీ పరిపాలన యంత్రాంగానికి సెల్ఫోన్లో ఆదేశాలు పంపారు. దీంతో గత పదేళ్లుగా వస్తున్న విధానాన్ని ఒక్కసారిగా ఎలా నిలిపి వేస్తారని భక్తులు తీవ్ర విస్మయానికి గురవుతున్నారు.
అసలు ఒంటిమిట్టలో వివాహాలు ఎలా జరిగేవి :
- ముందుగా ఆలయంలో వివాహాలు చేసుకునేందుకు అమ్మాయి, అబ్బాయి, తల్లిదండ్రుల ఆధార్ పత్రాలు, శుభలేఖ అందించే వారు.
- వివాహం చేయడానికి రుసుం రూ.500 చెల్లించేవారు.
- ఆలయంలో పని చేస్తున్న భజంత్రీల సిబ్బంది, అర్చకుల ద్వారా వివాహ క్రతువు నిర్వహించేవారు. వీరికి కొంత నగదు ఇచ్చి ఉపాధి దొరికేది.
- అలాగే ఆలయంలో వేదిక, షామియనాలు, విద్యుద్దీకరణ, పందిళ్లు, అతిథులు కూర్చోవడానికి కుర్చీలు, బల్లలు ఇలాంటి ఏవీ ఆలయంలో వేయరు.
- ఉదయం టిఫిన్, తేనీరు, భోజనం వసతి కూడా ఉండదు.
- ఇక్కడి కొలువైన రామలింగేశ్వరస్వామి ముంగిట్లో, సీతారాముల ఎదుర్కోలు మండపాల దగ్గరి చలువరాళ్లపై సాధారణంగా వివాహాలు చేసుకునే వారు.