Araku Valley Tourist Attractions: పాడేరు అందాలు నిత్యం పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అరకులోయ సొబగులు, వంజంగిలో మేఘాల సోయగాలు యాత్రికులను అబ్బురపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆంధ్ర ఊటీ అరకులోయకి కొత్త సొబగులు సమకూరుతున్నాయి. అరకులోయను సందర్శించే పర్యటకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ చొరవతో ఆంధ్ర ఊటీ అరకు లోయలోని పద్మాపురం ఉద్యానవనంలో సాహస వినోదాన్ని అందించేందుకు నూతనంగా హాట్ బెలూన్ ప్రారంభించారు.
అరకు లోయని ఏటా రెండు లక్షల మంది వరకు సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో అరకు లోయను మరింత విభిన్నంగా వినూత్నంగా చూపించాలనే ఉద్దేశంతో హాట్ బెలూన్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. అరకులోయలో పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు హాట్‌బెలూన్ ఉపయోగపడుతుందని అభిషేక్ చెప్పారు.
వీటితో పాటు పద్మాపురం ఉద్యానవనంలో రాత్రి 10 గంటల వరకూ సందర్శకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ దీపాల వెలుగులను విస్తరించాలని నిర్ణయించామన్నారు. అదే విధంగా త్వరలోనే అరకు లోయలో పారా మోటర్ గ్లైడింగ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక అభివృద్ధికి విస్తృత చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అరకు లోయను మరింతగా పర్యాటకులకు చేరువ చేసేందుకు నిర్ణయించామని ఐటీడీఏ పీవో వెల్లడించారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న అరకులోయ హాట్ బెలూన్‌తో మరింత శోభాయమానంగా ఉండనుంది. హార్ట్ బెలూన్‌లో పర్యాటకుల విహరిస్తూ అరకులోయ ప్రకృతి అందాలను కనులారా వీక్షిస్తూ సరికొత్త అనుభవాన్ని పొందనున్నారు. హాట్ బెలూన్ పర్యాటకుల ఆదరాభిమానాలు చూరగుంటే అరకులోయ సిగలో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది.