ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు - తగ్గనున్న ఛార్జీలు - ఏ ఏ రూట్లలో తిరుగుతాయంటే? - APSRTC ELECTRIC BUSES

ఏపీఎస్‌ ఆర్టీసీలోకి త్వరలో వెయ్యికి పైగా కొత్త విద్యుత్ బస్సులు - నిర్ణీత బస్ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు - కాలుష్యం గణనీయంగా తగ్గడంతోపాటు ప్రయాణికులకు తప్పనున్న ఛార్జీల బాదుడు

APSRTC Will Introduce 1050 Electric Buses
APSRTC Will Introduce 1050 Electric Buses (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 11:44 AM IST

APSRTC Will Introduce 1050 Electric Buses :ఏపీఎస్‌ ఆర్టీసీలో త్వరలో వెయ్యికి పైగా విద్యుత్ బస్సులు రయ్ రయ్ మంటూ తిరగనున్నాయి. కాలుష్యానికి తావు లేకుండా, కుదుపులకు ఆస్కారమివ్వని సరికొత్త అధునాతన బస్సులు రాష్ట్ర రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. 1050 బస్సులు ప్రవేశపెట్టేందుకు టెండర్లు పిలవగా వీటిని త్వరలో ఖరారు చేయనున్నారు. నిర్ణీత సమయంలో ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రానికి కేంద్రం అందించనుంది. ప్రస్తుతం తిరుపతి నగరంలో మాత్రమే విద్యుత్ బస్సులు తిరుగుతుండగా ఇకపై రాజధాని అమరావతి సహా విజయవాడ, గుంటూరు సహా పలు నగరాలు, పట్టణాలు పరిసర ప్రాంతాల్లో పరుగులు పెట్టనున్నాయి. విద్యుత్ బస్సుల రాకతో కాలుష్యం గణనీయంగా తగ్గనుండగా, ప్రయాణికులకు తరచూ చార్జీల బాదుడు తప్పనుంది. వచ్చే ఐదేళ్లలో సంస్థల్లో ఉన్న అన్ని డిజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తోంది.

ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం సహా వాతావరణంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలోకి విద్యుత్ బస్సులను ప్రవేశ పెడుతున్నాయి. ‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలో 1050 విద్యుత్ బస్సులను రోడ్డెక్కిస్తోంది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. విద్యుత్ బస్సుల కోసం కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(CESL) తో కలిపి ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు CESL టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. డిసెంబర్ 10 న టెండర్లు పిలవగా పలు సంస్థలు బిడ్లు దాఖలు చేశారు. త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నారు. బస్‌ కంపెనీలను ఎంపిక చేసి, వాటికి కిలోమీటర్ కు ఎంత ధర చొప్పున చెల్లించాలో నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయల మేర ఆయా కంపెనీలకు నేరుగా సబ్సిడీ ఇస్తుంది. ఈ ఏడాది చివరినాటి కల్లా అన్ని బస్సులూ ఆర్టీసీ కి అందజేయనున్నారు. అన్ని బస్సులనూ అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడుపనుంది.

Electric Buses: తిరుమల కొండపై పరుగులు పెట్టనున్న 25 విద్యుత్​ బస్సులు

ప్రధానమంత్రి ఈ-బస్‌ సేవ పథకం కింద తొలుత ఏపీలో 11 నగరాలకు 750 విద్యుత్‌ బస్సులు అద్దె ప్రాతిపదికన మంజూరు అయ్యాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలకు తిప్పేందుకు అదనంగా 350 విద్యుత్‌ బస్సులను మంజూరు చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి వ్యవహారాలశాఖ మంత్రికి లేఖ రాయగా కేంద్రం అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుతం కేంద్రం ఇచ్చే బస్సుల సంఖ్య 1050 కి చేరింది. ప్రస్తుతం తిరుమల - తిరుపతి మధ్య 50 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా భక్తులకు మరిన్ని విద్యుత్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం సిటీ -100, విజయవాడ సిటీ -100 , గుంటూరు సిటీ-100 , నెల్లూరు సిటీకి -100 బస్సులు చొప్పున కేటాయించనున్నారు. ఆయా నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతుండటం, బస్సులులేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతోన్న దృష్ట్యా బస్సుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతికే 50 విద్యుత్ బస్సులు కేటాయించారు. కర్నూలు -50 , కడప -50 , అనంతపురం-50 , కాకినాడ-50 , రాజమహేంద్రవరం- 50 బస్సులు చొప్పున మంజూరు చేశారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే విద్యుత్ బస్సులు రయ్ రయ్ మంటూ పరుగులు పెట్టనున్నాయి.

త్వరలోనే గుంటూరు జిల్లా రోడ్లపై - ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్!

విద్యుత్ బస్సులు ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బస్సు రానుపోనూ వంద కిలోమీటర్ల దూరం ఉండేలా నగరాలు సహా సమీపంలోని రూరల్ ప్రాంతాల్లోనూ బస్సులు తిప్పనున్నారు. వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో అల్ట్రా డీలక్స్‌ సర్వీసులుగా, ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సుల కింద కూడా పలు ప్రాంతాలకు నడుపనున్నారు. రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధాన పట్టణాల్లో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పనున్నారు. దీనికోసం నిర్ణీత బస్ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలల్లో డీజిల్‌ బస్సుల అన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన విద్యుత్‌ వాహనాల విధానం 2024-2029 కి అనుగుణంగా 2029 నాటికి సంస్థలో అన్నీ విద్యుత్‌ బస్సులే నడపాలని భావిస్తున్నారు. 5 ఏళ్లలో దశలవారీగా అన్ని డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించి కార్యాచరణ రూపొందించింది.

రెండున్నర గంటల ఛార్జింగ్‌ చేస్తే చాలు.. 500 కి.మీ దూరం ప్రయాణం!

ప్రస్తుతం అమల్లో ఉన్న మోటార్ వాహనాల చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలి. వచ్చే ఐదేళ్లలో 2537 బస్సులను తొలగించి వాటి స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి. ఈ బస్సులన్నింటినీ తప్పని సరిగా విద్యుత్ బస్సులే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది . మిగిలిన బస్సుల స్థానంలోనూ విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. ఇకపై సంస్థలో తీసుకోబోయే అద్దె బస్సులనూ విద్యుత్ వే తీసుకోనున్నారు. డీజిల్ బస్సుతో పోల్చితే విద్యుత్ బస్సు నిర్వహణ తక్కువగా ఉంటుంది. డీజిల్ బస్సుల వల్ల ఇంధనం ధరల పెరిగినప్పుడల్లా ప్రయాణికులపై చార్జీల భారం మోపాల్సి వస్తోంది. విద్యుత్ బస్సుల ఉత్పత్తి పెరిగి బస్సుల ధరలు తగ్గితే విద్యుత్ బస్సుల వినియోగం మరింత పెరుగుతుంది. ఈ బస్సుల సంఖ్య పెరిగితే ఆర్టీసీకి నిర్వహణ వ్యయం ఏటి కేడు తగ్గుతుంది. ప్రయాణికులపై ఛార్జీల భారం వేయాల్సిన అవసరం రాదు. ఎలక్ట్రిక్ బస్సులతో కాలుష్యానికి తావుండదు. తక్కువ ఛార్జీతోనే అలసటలేని ప్రయాణం సాకారంకానుంది. తద్వారా ప్రయాణికులకు, ఆర్టీసీకీ ప్రయోజనం చేకూరనుంది.

పుంగనూరులో ఉద్రిక్తత - ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమ ఏర్పాటుపై రైతుల నిరసన, భారీగా పోలీసుల మోహరింపు

ABOUT THE AUTHOR

...view details