APSRTC Suffered Heavy Damage Due to Impact of Floods : రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీకి అపార నష్టం వాటిల్లింది. వరద నీటితో విజయవాడలోని విధ్యాధరపురం, ఇబ్రహీంపట్నం బస్ డిపోలు, పలు వర్క్ షాప్లు, గ్యారేజీలు నీటమునిగాయి. విద్యాధరపురం డిపోలో రెండు రోజులుగా 40 బస్సులు నీటిలోనే మునిగి ఉన్నాయి. ఆదివారం రాత్రి ఒక్క సారిగా వరద రావడంతో బస్సులన్నీ మునిగిపోయాయి. పది అడుగుల నీటి లోతులో ఉన్న 40 బస్సులను స్థానిక డిపో అధికారులు ట్రాక్టర్లకు కట్టి బయటకు తరలించారు. మిగిలిన బస్సులను తరలించడం సాధ్యపడలేదు. డిపో బయటకు తరలించిన బస్సులను బైపాస్ రహదారిపై నిలిపినా పది అడుగుల లోతు నీరు రావడంతో మళ్లీ వాటి ఇంజిన్లలోకి నీరు వెళ్లాయి. దీంతో 70 బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఇదే జరిగితే ఆర్టీసీకి భారీ నష్టం : ఇబ్రహీం పట్నం బస్ డిపోలో సైతం 20 ఆర్టీసీ బస్సులు నీటిలో మునిగాయి. పలు బస్సుల్లోకి ఇంజిన్లలోకి నీరు వెళ్లి ఆగిపోయాయి. దీంతో విజయవాడ సిటీ పరిధిలో బస్సులు అరకొరగా తిరిగాయి. పాడైన ఇంజిన్లు మరమ్మతులు చేసేందుకు ఒక్కో బస్సుకు కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరమ్మతు కాకపోతే బస్సులను తుక్కుకు పంపాల్సిన పరిస్ధితి వస్తుందంటున్నారు. ఇదే జరిగితే ఆర్టీసీకి భారీ నష్టం మిగలనుంది. విద్యాధర పురంలోని ఆర్టీసీ వర్క్ షాప్, సహా టైర్ రీట్రేడింగ్ సెంటర్, ఆస్పత్రి, బస్ పార్కింగ్ ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున వరద ముంచెత్తడంతో కోట్ల విలువ చేసే కొత్త బస్సులు, పరికరాలు ,యంత్ర సామాగ్రి దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
నీళ్లలో బస్సు డిపోలు- డ్రైవర్లు, కండక్టర్లు లేక నడవని సర్వీసులు - APSRTC Depots Submerged in Water