APSRTC Serving the Ruling Party :ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యాపారి డబ్బులు చేతికొచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోడు. కానీ ఏపీఎస్ఆర్టీసీ తీరు వేరు. స్వామిభక్తిలో తరిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం వైసీపీ సిద్ధం సభలకు డబ్బులు అడక్కుండానే వేలసంఖ్యలో బస్సులను కేటాయిస్తోంది. ప్రయాణికుల పాట్లు పట్టించుకోకుండా పల్లెవెలుగు బస్సులతో సహా సీఎం సభలకు ఇచ్చేస్తోంది. అదే విపక్షాల సభలకు ముందే డబ్బులు చెల్లిస్తామని చెప్పినా ఇవ్వడం లేదు. కనీసం వందా, యాబై బస్సులు అడిగినా లేవని చెబుతోంది. అటు ప్రైవేట్ వాహనాలు, పాఠశాల బస్సులను సైతం ఇవ్వకుండా రవాణాశాఖ ఇబ్బందులు పెడుతోంది.
ఏపీఎస్ఆర్టీఎస్ (APSRTC)ని వైసీపీ ఆర్టీసీగా మార్చేశారు. సీఎం సభ ఉందంటే ఇంట్లో సొంత వాహనం తీసుకెళ్లినట్లు వైసీపీ నేతలు తీసుకెళ్లిపోతున్నారు. అటు ఆర్టీసీ యాజమాన్యం సైతం అద్దె డబ్బులు చెల్లించకున్నా మారుమాట్లాడటం లేదు. ప్రయాణికుల అవసరాల కంటే ముఖ్యమంత్రి సభలు, సమావేశాలకు బస్సులివ్వడమే ప్రాధాన్యంగా భావిస్తోంది. సీఎం సభ ఉందంటే ఆ చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం మానుకోవాల్సిందే. అధికారిక కార్యక్రమాలు, వైసీపీ బహిరంగ సభలకు పెద్దఎత్తున ప్రజలు తరలివస్తున్నారని ప్రదర్శించుకునేందుకు ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ పేద, మధ్యతరగతి వర్గాలకు బస్సు ప్రయాణం మరింత దుర్లభంగా మారుతోంది. అవసరమైతే పెళ్లిళ్లకు కేటాయించిన వాటిని, పండగలకు పెట్టిన ప్రత్యేక బస్సుల్నీ అర్ధంతరంగా రద్దు చేసి మరీ సీఎం సభలకు మళ్లిస్తున్నారు. ఒక డిపోలో ఉండే మొత్తం బస్సుల్లో 80% వరకు తరలిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో తిరిగే బస్సుల్నీ వదలడం లేదు. దీంతో ఆర్టీసీ బస్సునే నమ్ముకున్న బడిపిల్లలు, మహిళలు, పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగులు, ఉపాధి బాటలో రోజూ పట్టణాలకు వెళ్లే కార్మికులు ఇలా అన్ని వర్గాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామిభక్తి మరింత పెరిగింది. అధికార పార్టీ అడిగితే వందలు, వేలల్లో బస్సుల్ని జిల్లాలకు జిల్లాలు దాటించి వందల కిలోమీటర్లు పంపిస్తున్నారు.
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి: భువనేశ్వరి
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఆర్టీసీ బస్సులను ఇవ్వడం మామూలే. కానీ రాజకీయ పార్టీల సభల కన్నా ప్రయాణికుల అవసరాలకే అధిక ప్రాధాన్యమివ్వాలి. కానీ వైసీపీ సభలకు 70 నుంచి 80 శాతం బస్సులను కేటాయిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా (YSR District) మైదుకూరు డిపోలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 48 ఉండగా అందులో 40 బస్సుల్ని సీఎం సభకు కేటాయించడమే నిదర్శనం. 2023 అక్టోబరులో దసరా పండగకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆర్టీసీ 100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ద్వారా టికెట్లు కూడా అమ్మారు. కానీ జగన్ సభకు బస్సులు కావాలని అడగటంతో ఆ టిక్కెట్లన్నీ రద్దు చేసి బస్సులను సీఎం సభకు మళ్లించారు. ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందంటే రాష్ట్రంలో సగం జిల్లాల ప్రయాణికులు మూడురోజుల పాటు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందే. సభ జరిగే రోజుతోపాటు ముందురోజు, తర్వాత రోజు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు. అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం సిద్ధం సభకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు జిల్లా నుంచి బస్సులు కేటాయించడమే ఇందుకు నిదర్శనం.