APSRTC Reduce Charges On AC Buses Due To Winter Effect :ఏపీఎస్ఆర్టీసీ పై శీతాకాలం ప్రభావం పడింది. రాష్ట్రంలో రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతుండటంతో బస్సు ప్రయాణాలపై ప్రభావం చూపుతోంది. చలికి వణికిపోతోన్న ప్రయాణికులు ఏసీ బస్సులు ఎక్కేందుకు జంకుతున్నారు. దీంతో పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సీట్లు పూర్తిగా నిండకుండానే అలాగే వెళ్లాల్సి వస్తోంది. నష్టనివారణ సహా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు నెల రోజుల పాటు ఏసీ బస్సుల్లో ఛార్జీలను 10 నుంచి 20 శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికులకు లబ్ది చేకూరుతున్న దృష్ట్యా బస్సుల్లో సీట్లు నిండటం సహా ఆదరణ పెరిగేందుకు ఉపకరిస్తుందని అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
10 నుంచి 20 శాతం తగ్గిన ఛార్జీలు : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతున్నాయి. రాత్రివేళల్లో పలు ప్రాంతాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో చలి విజృంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ పైనా దీని ప్రభావం పడింది. చలి విపరీతంగా పెరగడంతో పలు రూట్లలో ఆర్టీసీ ఏసీ బస్సులు ఎక్కే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
దీంతో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో పలు ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఏసీ బస్సుల్లో సీట్ల ఖాళీలను బట్టి 10 నుంచి 20 శాతం ఛార్జీ తగ్గించాలని ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి ఛార్జీలను డిసెంబర్ నెలకు మాత్రమే వర్తించేలా ఛార్జీలు తగ్గించాలని ఆర్టీసీ ఆదేశించింది.
వృద్ధులకు గుడ్న్యూస్ - ఈ కార్డులుంటే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం రాయితీ
ఆదేశాలు జారీ చేస్తున్న డీపీటీవోలు : ఏ ఏ రూట్లలో ఏ బస్సుల్లో ఛార్జీలు తగ్గించాలనే నిర్ణయాన్ని జిల్లా ఇన్ చార్జీగా ఉన్న డీపీటీవో లకు అప్పగించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు రూట్లలో తిరిగే ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ ఆయా జిల్లాల డీపీటీవోలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖ పట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ ఎన్టీఆర్ జిల్లా డీపీటీవో ఎం. యేసుదానం ఆదేశాలు జారీ చేశారు.