APPSC Restrictions on Group1 Marks Details Release : గతంలో ఎన్నడూ లేని రీతిలో గ్రూప్-1 మార్కుల వెల్లడికీ ఎపీపీఎస్సీ ఆంక్షలు విధించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్కులు వెల్లడించకుండా కేవలం దరఖాస్తు చేసుకున్నవారికే తెలియజేస్తామన్న ఏపీపీఎస్సీ ప్రకటనపై సందేహాలు రేకిత్తిస్తున్నాయి. 2016 నోటిఫికేషన్ వరకు బహిరంగంగా జాబితాలు ఇచ్చే సంప్రదాయానికి కమిషన్ తిలోదకాలపై అభ్యర్థుల నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
గ్రూప్-1 మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ ఇంకా గోప్యత పాటిస్తోంది. 2022 నోటిఫికేషన్‌లో పేర్కొన్నదాని కంటే ఏడు నెలల ఆలస్యంగా మార్కులు వెల్లడిస్తారా అనే విమర్శల నేపథ్యంలో ప్రకటించినా, అవీ దరఖాస్తు చేసినవారికే తెలియజేస్తామని ఆంక్షలు విధించింది. యూపీఎస్సీలో కమ్యూనిటీ, సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులను వెల్లడిస్తున్నారు. ఏపీపీఎస్సీ కూడా 2016 నోటిఫికేషన్ వరకు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. అయితే 2018 నోటిఫికేషన్‌పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని ఏపీపీఎస్సీ మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది.
వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టుపట్టిన ఏపీపీఎస్సీ - తమవారికి ఉద్యోగాలు ఇప్పించుకునేందుకు అడ్డదారులు
2022 గ్రూప్-1 నోటిఫికేషన్‌లో ఎంపిక జాబితా వెల్లడి జరిగిన నెలరోజుల తర్వాత కోరిన వారికి మార్కుల మెమొరాండం అందిస్తామని పేర్కొన్నా అలా చేయలేదు. మార్కులు వెల్లడించకపోవడంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంగళవారం ఏపీపీఎస్సీ గుట్టుచప్పుడు కాకుండా వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన పెట్టింది. గ్రూప్-1 (28/2022) నోటిఫికేషన్ అనుసరించి మార్కుల మెమొరాండం అవసరమైనవారు ఈ నెల 22 నుంచి జూన్ 21లోగా కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.