Mistakes in APPSC Group 1 Exam: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు అభ్యర్థులను బెంబేలెత్తించాయి. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నలను ఆంగ్లం నుంచి తెలుగులోనికి అనువదించడంలోనూ తప్పులు దొర్లాయి. దీని వళ్ల తెలుగు మాధ్యమం అభ్యర్థులు ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు ఆంగ్లంలో, ఇటు తెలుగులోని ప్రశ్నలను పలుమార్లు చదివేందుకు అభ్యర్థులు తమ సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి వచ్చింది. కొన్ని సార్లు అనువాదం సరిగ్గా అర్థంకాక అయోమయానికి గురయ్యారు.
అభ్యర్థులకు అగ్ని పరీక్ష ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రశ్న పత్రంలో ముద్రణపరంగానూ కొన్ని తప్పులు దొర్లాయి. మరోపక్క గ్రూప్-2 ప్రిలిమ్స్ మాదిరిగానే ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంది. కొన్ని ప్రశ్నలు సివిల్స్ కంటే సంక్లిష్టంగా ఉన్నాయని కొంత మంది అభ్యర్థులు తెలిపారు. ముఖ్యంగా 63 పేజీలతో ఉన్న పేపర్-1 ప్రశ్నపత్రం అభ్యర్థులకు అగ్ని పరీక్ష పెట్టింది. కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ఆంగ్లం నుంచి తెలుగులోకి ప్రశ్నలను అనువాదం చేయడంలో తరచూ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. దీనివల్ల తెలుగు మాధ్యమంలో చదివిన వారు పోటీలో వెనుకబడుతున్నారు. సుదీర్ఘ కాలంపాటు సన్నద్ధమైన వారు మాత్రమే ఈ పరీక్షలో త్వరగా జవాబులు గుర్తించగలిగారు. వర్తమాన అంశాలపై పట్టున్నవారు, పత్రికలు బాగా చదివిన వారు పోటీలో కాస్త ముందంజలో ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై ఆందోళన వద్దు: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్