APCC Chief YS Sharmila Comments on Jagan :జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారని వస్తున్న వార్తలు అబద్ధమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రమని.. పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
జగన్ ఎప్పటికి అధికారంలోకి రాలేరు :జగన్ వస్తే బాగుండు అని కొంతమంది చెప్పుకుంటున్నారు. జగన్ మళ్లీ ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు. మళ్లీ రూ.10 లక్షల కోట్లు అప్పులు చేయడానికి రావాలా? అని నిలదీశారు. పోలవరంతో సహా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి మళ్లీ రావాలా? అన్నారు. మద్యపాన నిషేధం అని చెప్పి ప్రజల ప్రాణాలు తీయడానికి మళ్లీ రావాలా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోతుంటే కనీసం రిపేర్లు చేయలేదు, ఇందుకే జగన్ మళ్లీ రావాలా? అని నిలదీశారు. ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి మళ్లీ మోసం చేయడానికి రావాలా? అని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికి అధికారంలోకి రాలేరని షర్మిల స్పష్టం చేశారు. ఒక్కఛాన్స్ పేరిట ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారని ఆమె విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తామని జగన్ ప్రగల్బాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చేశారని మళ్లీ జగన్ రావాలని ఆమె ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి- మోసాలు ఆయనకు కొత్త కాదు: షర్మిల - YS SHARMILA TWEET