Telangana RTC Buses For AP Voters : దేశంలో జోరుగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మే 13న ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఉపాధి నిమిత్తం హైదరాబాద్, బెంగళూరుకు వచ్చిన ఓటర్లు అభిమాన పార్టీకి ఓటు వేసేందుకు సొంతూళ్లకు పయనవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే బస్సులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. నెల రోజుల క్రితమే రైల్ రిజర్వేషన్లు అయిపోయాయని వందల్లో వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Huge Rush in APSRTC Buses: రెండు రాష్ట్రాల ఆర్టీసీలు పదుల సంఖ్యలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా అన్నింటిలో సీట్లు నిండుకున్నాయి. అదనంగా నడిపేందుకు బస్సులు లేకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌లను సిద్ధం చేస్తోంది. బెంగళూరు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్ సర్వీసును ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి బస్సులో విశాఖకి 12 గంటలకుపైగా పడుతుండటంతో ఏపీ స్లీపర్‌కి డిమాండ్ పెరిగింది. ఎన్నికల సీజన్ కావడంతో ఎప్పుడూ లేనంతగా ప్రైవేట్ బస్సుల టికెట్ ధరలు పెంచేశారని ఓటర్లు చెబుతున్నారు.
Special Buses for AP voters : హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపురం, కాకినాడ, విశాఖవైపు వెళ్లే రైళ్లలో ఈనెల 12న రిజర్వేషన్లు పూర్తైపోయాయి. నెల్లూరు, తిరుపతి వైపు మార్గంలో దాదాపు ఇదే పరిస్థితి. ఈనెల10, 11న దూర ప్రాంత రైళ్లలో వందల సంఖ్యలో వెయిటింగ్‌లిస్ట్ ఉంది. మరి కొన్నింట్లో పరిమితి దాటి రిగ్రేట్ వస్తోంది. సికింద్రాబాద్ నుంచి వెళ్లే వివిధ స్పెషల్ రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. వేసవిసెలవుల దృష్ట్యా ప్రయాణికుల అవసరాలకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ అదనపు బస్సులు నడిపిస్తోంది. ముందుగా బుక్ చేసుకున్న వారికి టికెట్ ధరపై 10శాతం రాయితీ ఇస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు.