AP Rains: వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు కొన్నిచోట్ల వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షపు నీరు రోడ్లపై నుంచి ప్రవహించడంతో ప్రధాన ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రవాహ ఉద్ధృతికి అనేక చోట్ల కల్వర్టులు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రకాశం జిల్లాలో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మార్కాపురం మండలం భూపతిపల్లె గ్రామం వద్ద వంతెనపై నుంచి గుండ్లకమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తర్లుపాడు మండలం సీతానాగులవరం వద్ద కొండవాగు పొంగడంతో మార్కాపురం- తర్లుపాడు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి వద్ద రహదారిపై వరద నీరు నిలిచిపోవడంతో సుంకేసుల, గుండంచెర్ల, కలనూతల గ్రామాల ప్రజలు మార్కాపురం వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. మరోవైపు పొలాల్లోకి భారీగా నీరు చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భయాందోళనకు గురవుతున్న ప్రజలు: కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ సమీపంలో మూడు రోజులుగా సముద్రం ముందుకు వస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒడ్డున ఉన్న దుకాణాలు, చిరు వ్యాపారాలు నిర్వహించుకునే ప్రదేశాల వరకు నీరు వచ్చేయడంతో వారు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేశారు.