AP POLICE HANDOVER CARS TO VICTIM: ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి బాధితుడు మూడు సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అతనిని నమ్మినందుకు ఏకంగా ఆరు కార్లను తాకట్టు పెట్టాడు ఓ వ్యక్తి. ఆరు కార్లను అద్దెకి తీసుకుని వాటిని వైఎస్సార్సీపీ నేతల వద్ద తాకట్టు పెట్టడంతో బాధితుడు ఏం చేయలేని పరిస్థితి ఎదురైంది. దీంతో మూడు సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిగా ప్రయోజన లేకపోయింది.
మూడేళ్ల నుంచి పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లను పోలీసులు ఎట్టకేలకు బాధితుడికి అప్పగించారు. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో రంగంలోకి దిగిన కడప జిల్లా పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకుల దగ్గర ఉన్న ఆరు కార్లను బాధితుడు సతీష్ కుమార్ గుర్తించడంతో ఆయన సమక్షంలో తెలంగాణ పోలీసులకు అప్పగించారు. 2021లో సంగారెడ్డికి చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్కు చెందిన ఆరు కార్లను మణిరాజ్ అనే వ్యక్తి అద్దెకు తీసుకుని పులివెందుల వైఎస్సార్సీపీ నాయకుల వద్ద తాకట్టు పెట్టాడు.
మూడేళ్ల కిందట సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైనా, కార్లను స్వాధీనం చేసుకోలేక పోయారు. మూడేళ్లలో బాధితుడు సతీష్ కుమార్ 15 సార్లు పులివెందుల, వేంపల్లెకు వచ్చినా వైఎస్సార్సీపీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్నాడు. 2022లో ఇడుపులపాయ ఎస్టేట్లో ఐదు రోజులు బంధించి చంపేందుకు యత్నించారని బాధితుడు తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కడప జిల్లా పోలీసులు కదిలారు.