Legislative Council Passed 5 Bills: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. నేడు 5 బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపింది. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు-2024, బోర్డు సభ్యుల నియామకాల్లో వివక్ష చూపకుండా నిరోధిస్తూ 3 చట్టాలకు సవరణ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు-2024, ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ల సవరణ బిల్లు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
YSRCP MLCs DEMAND DISCUSSION ON ANGANWADI PROBLEMS: మరోవైపు నేడు సభ ప్రారంభం కాగానే, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, 108, 104 ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభం కాగానే ఈ అంశాలపై చర్చించేందుకు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు తిరస్కరించారు. సభా కార్యకలాపాలు వాయిదా వేయడం కుదరదని, మరో ప్రతిపాదనతో వస్తే పరిశీలిస్తామని తెలిపారు.
విద్యారంగంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పలువురు సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్నీ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ ఛైర్మన్ పోడియంను చుట్టు ముట్టారు. వాయిదా తీర్మానాలు చేపట్టి చర్చించాలని ఆందోళన చేశారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, 108, 104 ఉద్యోగుల సమస్యలును వెంటనే పరిష్కరించాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.