AP High Court Comments on Sarada Peetham Building in Tirumala: తిరుమలలోని శారదాపీఠం భవన నిర్మాణం విషయంలో ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను ఉపేక్షించడానికి వీల్లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ భవనం నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది. 'ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేపడతారు?' అని ధర్మాసనం ప్రశ్నించింది. అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరిపితే ఏం జరుగుతుందో ఈ కేసు ఒక ఉదాహరణ కావాలని హైకోర్టు పేర్కొంది.
తిరుమలలో అక్రమ నిర్మాణాలు : విశాఖ శారదాపీఠం తిరుమలలో అక్రమ నిర్మాణాలను చేపడుతున్నప్పటికీ టీటీడీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తిరుమల క్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు, న్యాయవాది తుమ్మా ఓంకార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గతంలోనే ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపి భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఈ పిల్‌పై మరోసారి విచారణ జరిగింది. శారదాపీఠం భవనాన్ని సీజ్ చేస్తూ టీటీడీ బోర్డు తీర్మానం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
కూల్చివేతకు ఆదేశాలిస్తాం : అయితే బిల్డింగ్ ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు ఎలా చేస్తారని? హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతకు ఆదేశాలిస్తామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అనంతరం కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని శారదాపీఠం తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అందుకు అనుమతిస్తూ తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.