High Court On MBBS Seat: నీట్ కౌన్సిలింగ్-2022లో అర్హత పొందిన ఓ విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు నిరాకరించినందుకు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిహారం కింద ఆ విద్యార్థికి రూ.7 లక్షలు, ఖర్చుల కింద మరో రూ. 25 వేలు చెల్లించాలని విశ్వవిద్యాలయ అధికారులను ఆదేశించింది. విశ్వవిద్యాలయం చర్యల వల్ల ఆ యువతి ఎంబీబీఎస్ సీటు కోల్పోయి డెంటల్ కోర్సులో చేరారని గుర్తు చేసింది. ఈ ఘటన జరిగి ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్న నేపథ్యంలో విద్యార్థినికి ఎంబీబీఎస్ సీటు కేటాయించడం సాధ్యం కాదని వివరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పును ఇచ్చింది.
హైకోర్టు కీలక తీర్పు: నెల్లూరు, బాలాజీనగర్‌కు చెందిన రేవూరు వెంకట అశ్రిత వైద్య విద్యలో ప్రవేశాల కోసం 2022లో నీట్ పరీక్ష రాశారు. ఆ విద్యార్థినికి ఎన్‌సీసీలో బి-సర్టిఫికెట్ ఉంది. ఎన్‌సీసీ ఓపెన్ మహిళ కేటగిరి కింద ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నారు. తనకంటే ఎన్‌సీసీ ర్యాంక్, నీట్‌లో తక్కువ మార్కులొచ్చిన దేసబోయిన చందన అక్షిత అనే యువతికి నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు కేటాయించడాన్ని సవాలు చేస్తూ అశ్రిత 2022 నవంబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కౌంటర్ వేస్తూ బీసీ-డి కేటగిరికి చెందిన జక్కల జాహ్నవికి ఓపెన్ రౌండ్‌లో లోకల్/ఓసీ/ఫిమేల్/ఎన్‌సీసీ కేటగిరి కింద నారాయణ మెడికల్ కళాశాలలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు కేటాయించామన్నారు.
తర్వాత విడతలో జాహ్నవి తిరుపతి ఎస్‌వీయూ మెడికల్ కళాశాలకు వెళ్లారన్నారు. నారాయణ మెడికల్ కళాశాలలలో జాహ్నవి ఖాళీ చేసిన ఎంబీబీఎస్ సీటును తర్వాత అర్హురాలైన దేసబోయిన చందన అక్షితకు కేటాయించామన్నారు. పిటిషనర్/అశ్రిత బీసీ-డీ కేటగిరికి చెందిన వారు కాకపోవడంతో జాహ్నవి ఖాళీ చేసిన సీటును అక్షితతో భర్తీ చేశామన్నారు. పిటిషనర్ అశ్రిత తరఫు న్యాయవాది జి. ప్రియాంక వాదనలు వినిపిస్తూ నంద్యాల శాంతారాం మెడికల్ కళాశాలలో జాహ్నవి సీటు పొందారని, ఆ తర్వాత విడతలో ఆ యువతికి ఎస్‌వీయూ వైద్య కళాశాలలో సీటు దక్కిందన్నారు. ఈ నేపథ్యంలో నారాయణ మెడికల్ కళాశాలలో జాహ్నవి చేరడం, సీటును వదిలేశారనే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.
రూ.7 లక్షలు పరిహారం:ఆధారాలను, వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎన్‌సీసీ మహిళల కోటా ఓపెన్ కేటగిరి కింద నారాయణ వైద్య కళాశాలలో జాహ్నవికి సీటు కేటాయించినట్లు ఆధారాలను తమ ముందు ఉంచాలని వర్సిటీ అధికారులను ఆదేశించింది. పలుమార్లు అవకాశం ఇచ్చినా ఆధారాలను కోర్టు ముందు ఉంచలేకపోయారు. ఈ నేపథ్యంలో జాహ్నవి శాంతారాం కళాశాల నుంచి నేరుగా ఎస్‌వీయూ వైద్య కళాశాలకు వెళ్లారని ధర్మాసనం పేర్కొంది.