AP High Court reacts to Guntur diarrhea death:గుంటూరులో కలుషిత నీళ్లు తాగి ప్రజలు మరణిస్తుండటంపై హైకోర్టు స్పందించింది. వాస్తవాలు పరిశీలించి నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి టి.లీలావతి జీజీహెచ్ (GGH) కు వెళ్లి పరిశీలించారు.
జీజీహెచ్‌ను పరిశీలించిన సివిల్ జడ్జి: సీనియర్ సివిల్ జడ్జి టి.లీలావతి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బాధితులతో మాట్లాడారు. ఏ ప్రాంతంలో ఉంటారు, ఎప్పటి నుంచి అనారోగ్యం పాలయ్యారు, కారణాలేంటనే అంశాలపై వివరాలు సేకరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్‌తో జడ్జి లీలావతి సమావేశమై చర్చించారు. అనారోగ్య కారణాలు, బాధితుల పరిస్థితి, అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. పాత పైపులైన్లు, లీకేజీలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల నీరు కలుషితమై ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మంత్రితో పాటు ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు ఈ విషయంలో సరైన కారణాలు వెల్లడించడం లేదు. నీటి నివేదిక వివరాలను బయటపెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో వాస్తవాల ఆధారంగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు (High Court) ఆదేశించింది.
గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన!